- ఈ లింక్ ప్రాజెక్ట్‌ను నిలువరించాలని తెలంగాణ సర్కార్ పిటిషన్
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం,- నల్లమల్ల సాగర్ (బనకచర్ల) లింక్ ప్రాజెక్ట్‌ను నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మిగులు, వరద జలాల పేరుతో గోదావరిపై ఏపీ అక్రమంగా నిర్మించనున్న పోలవరం– బనకచర్ల లింక్ ప్రాజెక్‌ను ఆపాలని గత డిసెంబర్‌లో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వరద నీటిని తరలించే ముసుగులో ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిందని ఆరోపిస్తూ ఆర్టికల్ 32 ప్రకారం 251 పేజీలతో ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ గత సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయమాల్య బాగ్చీల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎందుకు మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించుకోకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం హైపవర్ కమిటీ వేసినందున, దానిముందు అభ్యంతరాలు చెప్పుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించింది. అయితే, ఈ లింక్ ప్రాజెక్ట్ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హతా ఉందా? అన్న అంశంపై పలు కామెంట్లు చేసింది. సమగ్ర వివరాలతో స్పెషల్ సూట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
