- మరో 50 వేల మంది ఎస్‌హెచ్‌జీల్లోనూ చేరిక
- మొత్తం 18 వేల సంఘాలే సర్కార్ టార్గెట్
హైదరాబాద్, వెలుగు:దివ్యాంగులు పొదుపు బాట పట్టారు.. స్వశక్తితో ముందుకు సాగుతూ స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. సమాజంలో వారు ఆత్మగౌరవంతోపాటు ఆత్మస్థైర్యంతో బతికేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పెన్షన్లే ఆధారంగా జీవితాన్ని వెళ్లదీసినవారు.. తాము ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు.. మహిళా సంఘాల స్ఫూర్తితో ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక పొదుపు సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఏర్పాటు చేస్తూ సభ్యులుగా చేరుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి అండగా నిలిచేందుకు సర్కారు ఈ సంఘాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10,164 దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు షురూ చేశారు. అంతకుముందు 50 వేల మంది దివ్యాంగులు ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లోనూ సభ్యులుగా కొనసాగుతున్నారు.
18 వేల గ్రూపులే లక్ష్యం
రాష్ట్రంలో మొత్తం 4.05 లక్షల మంది దివ్యాంగులు ఉండగా.. వీరిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మొత్తం18 వేల సంఘాలను ఏర్పాటు చేయాలని సెర్ప్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. 5 నుంచి 15 మంది సభ్యులతో ఒక్కో గ్రూపుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేసుకుంటూ అవసరమైనప్పుడు ఆ డబ్బును వాడుకోవడంతోపాటు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించనున్నారు.
కేవలం పొదుపు చేయడమే కాదు.. ఈ సంఘాల ద్వారా దివ్యాంగులకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. కిరాణా దుకాణం, మిల్క్ డైయిరీలు, పచ్చళ్ల, అగర్బత్తీల తయారీ వంటి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేందుకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల వారు స్వశక్తితో ఎదిగే అవకాశం ఉంటుంది.
సంఘాల ఏర్పాటులో నాగర్‌కర్నూల్ టాప్
దివ్యాంగుల సంఘాల ఏర్పాటులో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఆ తర్వాత నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా 534 సంఘాలతో టాప్ లో నిలిచింది. నల్గొండ 522, రంగారెడ్డి 504, వికారాబాద్ 464, ఖమ్మం 424 జిల్లాలో సంఘాలు ఏర్పాటయ్యాయి. పల్లెల్లోని దివ్యాంగులు చిన్న చిన్న అవసరాలకు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోకుండా తమ సంఘం నిధులనే వాడుకునేలా వెసులుబాటు కలుగుతుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక భరోసాతో పాటు సామాజిక గుర్తింపు..
పొదుపు సంఘాల ఏర్పాటు వెనుక కేవలం ఆర్థిక కోణమే కాకుండా సామాజిక మార్పు ఉంది. ఇన్నాళ్లుగా శారీరక ఇబ్బందుల కారణంగా నాలుగు గోడలకే పరిమితమై సమాజంలో చిన్నచూపుతోపాటు సానుభూతికి మాత్రమే పరిమితమైన దివ్యాంగులను ఈ సంఘాలు ఒక వేదికపైకి తెస్తున్నాయి. తమలాంటి సమస్యలున్న తోటివారితో కష్టసుఖాలను పంచుకోవడం ద్వారా వారిలో తాము ఒంటరి కాదనే భావన కలుగుతోంది. తద్వారా వారిలో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతున్నాయి.
ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లను కేవలం ఖర్చులకే వాడేయకుండా.. పొదుపు బాటలో మళ్లించడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు భరోసా ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో కుటీర పరిశ్రమలు లేదా చిరు వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా వారు లబ్ధిదారుల నుంచి నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. శారీరక వైకల్యం ప్రగతికి అడ్డంకి కాదని పట్టుదల ఉంటే ఎవరైనా ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఈ సంఘాల ద్వారా దివ్యాంగులు సమాజానికి చాటిచెబుతున్నారు.
రాష్ట్రంలో దివ్యాంగుల సంఖ్య 4.05 లక్షలు
దివ్యాంగుల సంఘాలు 10,164
సర్కార్ టార్గెట్ 18,000
ఎస్‌హెచ్‌జీల్లో
ఇప్పటికే పొదుపు చేస్తున్నవారు 50,000 మంది
ఒక్కొక్క గ్రూపులో సభ్యులు 5 నుంచి15 మంది
