- కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: అనాథలను బీసీ ‘ఏ’ లుగా గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న 10 ఏండ్ల నిబంధనను 49 ఏండ్లకు పెంచాలని వచ్చిన వినతిపై ఈ నెల 24న విచారణ జరుపుతామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. అలాగే బీసీ జాబితాలోని ‘డి’ గ్రూప్‌లో ఉన్న ‘సాతాని’ పదాన్ని తొలగించాలంటూ చాత్తాద శ్రీవైష్ణవ ప్రతినిధులు చేసిన వినతిపైనా విచారణ చేపడ్తామన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బీసీ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ వివిధ అంశాలపై చర్చించింది.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని లొద్ద కులం వారిని బీసీలుగా గుర్తించాలని వచ్చిన వినతులపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. వారి సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయాలని కమిషన్ నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో రిజర్వేషన్ల ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులను కమిషన్ పరిశీలిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఆయా సంస్థలను సందర్శించాలని ఇప్పటికే సూచించినట్లు చైర్మన్ గుర్తుచేశారు.
ఈ అంశంపై సంబంధిత సంస్థల నుంచి మరింత సమాచారం కోరాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిపారు. 2022లో ఎంబీసీ కులాలకు చెందిన విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇకముందు కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పారు. అలాగే, కేంద్ర ఓబీసీ జాబితాలో లేని 40 బీసీ కులాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ అవకాశాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, కమిషన్ మెంబర్ సెక్రటరీ బి. బాల మాయదేవి పాల్గొన్నారు.
