ఎప్‌సెట్‌లో బీసీ గురుకుల స్టూడెంట్ల సత్తా..3,781 మంది స్టూడెంట్స్ క్వాలిఫై

ఎప్‌సెట్‌లో బీసీ గురుకుల స్టూడెంట్ల సత్తా..3,781 మంది స్టూడెంట్స్ క్వాలిఫై
  • 516వ ర్యాంక్ సాధించిన హర్షిణి

హైదరాబాద్, వెలుగు: ఎప్‌సెట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల సొసైటీ నుంచి మొత్తం 3,781 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని సొసైటీ సెక్రటరీ సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మొత్తం ఫలితాల్లో 5 వేల లోపు ర్యాంకును 46 మంది, 10 వేల లోపు ర్యాంకును 178 మంది విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు.

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం నుంచి మొత్తం 1,626 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని చెప్పారు. 5 వేల లోపు ర్యాంకులు 43 మంది విద్యార్థులు,10 వేల లోపు ర్యాంకులు122 మంది స్టూడెంట్లు సాధించారని పేర్కొన్నారు. అగ్రికల్చర్ , ఫార్మసీ విభాగంలో హర్షిణి (516వ ర్యాంక్), కల్పిత (1,315వ ర్యాంక్), కె. శ్రవణ్ కుమార్ (1,377వ ర్యాంక్), టి. నవ్య (1,692వ ర్యాంక్) అత్యుత్తమ ప్రతిభ చాటారని వివరించారు.

ఇంజనీరింగ్ విభాగంలో బి. అనిరుధ్ (3,513వ ర్యాంక్), జి. వినోద్ కుమార్ (3,568వ ర్యాంక్), ఎన్. రుషిక్ వర్మ (4,433వ ర్యాంక్) సాధించారని వెల్లడించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి ప్రత్యేకంగా అభినందించారు. బీసీ గురుకులాల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణకు ఈ ఫలితాలే నిదర్శనమని వారు కొనియాడారు.

గతంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం రెండు సీవోఈలు (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) మాత్రమే ఉండగా, గతేడాది కొత్తగా 10 కాలేజీలను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. రాబోయే ఏడాదిలో మరో 10 సీవోఈలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా విద్యార్థులు వచ్చే ఏడాది మరిన్ని ఎక్కువ అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.