సైఫాబాద్, వెలుగు: నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్ బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా పదవిని వీడడం లేదని విమర్శించారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. నీట్ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకూ ఉందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
విద్యార్థుల ఉద్యమానికి బీసీ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా తదితరులు పాల్గొన్నారు.
