రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఎక్కడ?

రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఎక్కడ?
  •  విద్యా దినోత్సవాన్ని నిరసిస్తూ 
  • బీసీ విద్యార్థి నాయకుల నిరసన

ముషీరాబాద్/ కుషాయిగూడ,వెలుగు: ప్రైవేట్ విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తోందని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం విద్యానగర్​లోని బీసీ భవన్ వద్ద నల్ల కండువాలతో బీసీ విద్యార్థి నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80 శాతానికిపైగా విద్యాసంస్థలు అధికార పార్టీ నాయకులకు చెందినవే ఉన్నాయని, ప్రైవేట్ యూనివర్సిటీ పేర్లతో రిజర్వేషన్లు తొలగించి రకరకాల కోర్సులు పెట్టి స్టూడెంట్ల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిపెట్టి సంక్షేమ హాస్టళ్లను నిర్మించాలని,  స్టూడెంట్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య  పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ప్రచార వేదికలు

కుషాయిగూడ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవాలు అధికార పార్టీ ప్రచార వేదికలంటూ ఏఎస్​రావు నగర్ ​కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష మండిపడ్డారు. మంగళవారం డివిజన్​లోని డాక్టర్ హోమిజేబాబా కమ్యూనిటీ హాల్​లో నిర్వహించిన ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం తన ఫొటో పెట్టలేదని, విద్యాశాఖ నిర్ణయించిన టైంకు వచ్చినప్పటికీ అధికారులు బీఆర్ఎస్​ లీడర్లకు స్వాగతం పలికే పనిలో ఉండటం సిగ్గుచేటన్నారు. తాను ఉత్సవాలను బహిష్కరిస్తున్నానంటూ వేదిక దిగి వెళ్లిపోయారు.