దేశాన్ని మళ్లీ బానిసత్వంలోకి తెచ్చే కుట్ర : సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌

దేశాన్ని మళ్లీ బానిసత్వంలోకి తెచ్చే కుట్ర : సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌

మెయిన్‌‌పురి (యూపీ): దేశాన్ని మళ్లీ బానిసత్వంలోకి లాగేందుకు కాంగ్రెస్‌‌, సమాజ్‌‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి కుట్ర చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్‌‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ అన్నారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అణగదొక్కి, వారి రిజర్వేషన్లను మైనార్టీలకు మళ్లించేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గురువారం మెయిన్‌‌పురిలో బీజేపీ అభ్యర్థి జైవీర్‌‌‌‌ సింగ్‌‌కు మద్దతుగా జరిగిన రోడ్‌‌ షోలో యోగి మాట్లాడారు. ఇండియా కూటమికి మద్దతిస్తే అది భారత్‌‌ విశ్వాసాన్ని దెబ్బతీయడంతో సమానమని పేర్కొన్నారు. నిజమైన దేశ భక్తులు ఎవ్వరూ ఈ పార్టీల ఎజెండాను అనుమతించరన్నారు. మాజీ సీఎం కళ్యాణ్ సింగ్‌‌ తన జీవితాన్ని శ్రీరాముడికి, రాష్ట్ర ప్రగతికి అంకితం చేశారని, అలాంటి వ్యక్తి మరణిస్తే సమాజ్‌‌ వాదీ పార్టీ కనీసం సంతాపం కూడా తెలపలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఎస్పీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.