మోదీ మళ్లీ గెలిస్తే హిట్లర్ పాలనే: సీపీఐ నారాయణ

మోదీ మళ్లీ గెలిస్తే హిట్లర్ పాలనే: సీపీఐ నారాయణ
  • దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు: నారాయణ 
  • రాజ్యాంగాన్ని మారుస్తరని వ్యాఖ్య

ఖమ్మం టౌన్, వెలుగు: మోదీ మళ్లీ గెలిస్తే హిట్లర్ పాలన కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ‘‘మోదీ కోరుతున్నట్టు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయి. ఇక ప్రజాస్వామ్యం ఉండదు. హిట్లర్ పాలన కొనసాగుతుంది” అని పేర్కొన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ స్థాయి సీపీఐ కార్యకర్తల సమావేశం గురువారం స్థానిక ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగింది.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మోదీ తన దత్తపుత్రులైన అంబానీ, అదానీతో పాటు మరో 29 మంది కార్పొరేట్ శక్తుల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ‘‘తనకు కుటుంబం లేదని, తాను ఎలాంటి అవినీతి చేయలేదని మోదీ చెబుతున్నారు.

కానీ మోదీ దత్తపుత్రులంతా అవినీతిపరులే. మోదీ తన కుటుంబాన్ని మోసం చేశారు. ఇప్పుడు దేశాన్నే మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. బీజేపీని ప్రశ్నించినందుకు ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టారు. ఇప్పుడు మూడో ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవు. తమకు ఇష్టమైనోళ్లు ఏ తప్పు చేసినా బీజేపీ మాట్లాడదు.

జగన్ రూ.లక్షల కోట్లు దోచుకుని, పదేండ్లుగా బెయిల్ పై ఉన్నారు. ఆయన బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు కాలం చెల్లిందని,  జనం ఇప్పుడు కేసిఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. 

కూటమికి ఎదురు  లేదు: కూనంనేని 

ఉమ్యమ ఖిల్లాలో ఇండియా కూటమికి ఎదురులేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కంచుకోట అని తెలిపారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ ను బలపరుస్తున్నామని చెప్పారు. దేశం కోసం కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేశారని, ఈ పొత్తు కూడా త్యాగం లాంటిదేనని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఎర్ర జెండాలే నాకు స్ఫూర్తి: తుమ్మల

ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ‘‘సీపీఐ, సీపీఎంతో నాది సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. అప్పుడప్పుడు కాస్త దూరమైనా కమ్యూనిస్టులతో చెలిమి మాత్రం కొనసాగుతున్నది. ఇండియా కూటమితో కలిసి సీపీఐ, సీపీఎం పని చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కూటమి ఘన విజయం సాధిస్తుంది. మతతత్వ బీజేపీని ఓడించేందుకు అందరూ కలిసిరావాలి” అని కోరారు. 

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ప్రత్యక్షమే..: పొంగులేటి 

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదని, ప్రత్యక్షమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. దీన్ని కేసీఆర్ మాటలే రుజువు చేస్తున్నాయని చెప్పారు.  నామా నాగేశ్వరరావు కేంద్రమంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారని, బీజేపీతో పొత్తు లేకుండా అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ పదేండ్లలో రూ.1.50 లక్షల కోట్లు దోచుకున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ధరణి, కాళేశ్వరం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వాటి నుంచి బయటపడేందుకు బీజేపీతో చేతులు కలిపారు” అని అన్నారు.