ఎన్నికల బరి నుంచి బ్రిజ్‌‌ భూషణ్‌‌ ఔట్​

ఎన్నికల బరి నుంచి బ్రిజ్‌‌ భూషణ్‌‌ ఔట్​

న్యూఢిల్లీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా మాజీ ప్రెసిడెంట్‌‌, బీజేపీ నేత బ్రిజ్‌‌ భూషణ్‌‌ శరణ్‌‌ సింగ్‌‌ లోక్‌‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో బ్రిజ్‌‌ భూషణ్‌‌కు బదులు ఆయన​కొడుకు కరణ్‌‌ భూషణ్‌‌ సింగ్‌‌కు ఉత్తరప్రదేశ్‌‌లోని కైసర్‌‌‌‌గంజ్‌‌ టికెట్‌‌ను బీజేపీ కేటాయించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ప్రకటన విడుదల చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే బ్రిజ్‌‌ భూషణ్‌‌కు బీజీపీ టికెట్‌‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌‌ భూషణ్‌‌కు కైసర్‌‌‌‌గంజ్‌‌ పార్లమెంట్‌‌ నియోజవర్గంపై మంచి పట్టు ఉంది. 

అయితే, ప్రముఖ రెజ్లర్లు బజరంగ్‌‌ పూనియా, వినేశ్‌‌ పొగట్‌‌, సాక్షి మాలిక్‌‌ తదితరులు బ్రిజ్‌‌ భూషణ్‌‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో నిరసన చేశారు. దీంతో బ్రిజ్‌‌ భూషణ్‌‌కు బీజేపీ టికెట్‌‌ ఇవ్వకుండా ఆయన కుమారుడికి ఇచ్చి, ఆ స్థానంలో గెలవాలని చూస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌‌ కంచుకోట అయిన రాయ్‌‌బరేలి నుంచి బీజేపీ తన అభ్యర్థిగా ప్రతాప్‌‌ సింగ్‌‌ను ప్రకటించింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌‌ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్‌‌ మాజీ చీఫ్‌‌ సోనియా గాంధీ ఇక్కడి నుంచి చాలా సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.