- జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి
- జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేశన శంకర్రావు
- విజయవాడ బీసీ డిక్లరేషన్ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: దేశ, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. విజయవాడలోని లారీ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్ రావు ఆధ్వర్యంలో బీసీల మేధోమథన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బీసీ మేధావులు, ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమకారులు, వివిధ కుల సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు బీసీల సమస్యలపై చర్చించారు.
అనంతరం బీసీల హక్కుల సాధన కోసం రూపొందించిన విజయవాడ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కులగణన చేపట్టకపోవడం 70 కోట్ల మంది బీసీలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఈ జనగణనలోనే బీసీ కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా బిల్లులో సబ్‌కోటా బీసీ మహిళల హక్కు అని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. శంకర్ రావు మాట్లాడుతూ దేశంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసి, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.
