బషీర్ బాగ్, వెలుగు: బీసీ అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని.. బ్రిలియంట్ క్లాస్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆయన చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని హక్కుగా కాకుండా బాధ్యతగా చేసినప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులు సమాజంలో చెడ్డ పేరును మూటగట్టుకుంటారని చెప్పారు. ‘‘నేను తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని అయినందున మంచి స్థాయిలో పోస్టింగ్ తీసుకోవచ్చు కదా.. అని నా సన్నిహితులు ఎప్పుడూ అడుగుతుంటారు.
కానీ నేను ఎప్పుడూ అలా అడిగి మంచి పోస్టింగ్ తీసుకునేందుకు ప్రయత్నించలేదు. ఏ పోస్టింగ్ ఇచ్చినా బాధ్యతగా తీసుకుంటాను” అని వెంకటేశం తెలిపారు. ప్రస్తుతం తాను పని చేసున్న శాఖలో 10 వేల మంది ఉద్యోగులు ఉంటారని, అందులో కనీసం 2 శాతం మంది ఉద్యోగులు కూడా సక్రమంగా పని చేయలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉందని.. బీసీ ఉద్యోగులు ఈ అపకీర్తిని పొగొట్టాలని సూచించారు.బీసీ అనే వెనుకబాటుతనం, వివక్ష రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయి అధికారుల నుండి కింది స్థాయి వరకు ప్రతిస్థాయిలోనూ ఉంటుందన్నారు. నిజాయతీగా వ్యవహరిస్తే ఆ వివక్ష దూరమవుతుందన్నారు. ప్రతి శాఖలో బీసీ ఉద్యోగులు 50 శాతం మంది ఉంటారని, వారందరినీ ఒకేతాటిపైకి తెచ్చి ఐక్యతను చాటాలన్నారు.
