గుడ్ న్యూస్: ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్లో పర్మినెంట్ RC లు..

గుడ్ న్యూస్: ఏప్రిల్ 11 నుంచి ఆన్లైన్లో పర్మినెంట్ RC లు..

తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ సేవలు ఆన్ లైన్ ద్వారా అందించాలనే సంకల్పంతో ఇప్పటికే తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. 2026 ఏప్రిల్ 11 నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్లు రవాణా శాఖ తెలిపింది. అంటే ఏప్రిల్ 11 నుంచి ఆన్ లైన్ లోనే పర్మినెంట్ RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) జారీ చేయనున్నారు. 

తెలంగాణ రవాణా శాఖ కేంద్ర వాహన్ పోర్టల్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వాహన్ పోర్టల్ ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. 2026 మార్చి 23 నుంచి సేవలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు వెయ్యి మంది డీలర్లకు శిక్షణ పూర్తయింది. 346 ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్లు పూర్తి చేశారు. 671 డీలర్లకు అధికారం, పోర్టల్‌లో చేర్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత సేవలు అందుబాటులోకి వచ్చినట్లు రవాణా శాఖ పేర్కొంది. దశలవారీగా సిస్టమ్ బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆన్ లైన్ లో 33 వేల  తాత్కాలిక RCలు జారీ చేశారు. ఏప్రిల్ 11 నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతుందని తెలిపారు. 

నెక్స్ట్‌జెన్ ఎమ్-పరివాహన్ యాప్‌ (NextGen m-Parivahan App)లో RC, DL డౌన్‌లోడ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరిన్ని సేవలు త్వరలో యాప్‌లో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. దీంతో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కీలక ముందడుగు పడినట్లు తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పారదర్శకత పెంపు, ప్రాసెసింగ్ టైమ్ తగ్గింపు మొదలైన ప్రయోజనాలున్నట్లు చెప్పారు. పౌరులకు సులభమైన సేవలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.