Sreeleela: సాకులు చెప్పొద్దు.. చేసే పనికి పీరియడ్స్ అడ్డు కాదు.. శ్రీలీల కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Sreeleela: సాకులు చెప్పొద్దు.. చేసే పనికి పీరియడ్స్ అడ్డు కాదు.. శ్రీలీల కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

టాలీవుడ్ ‘డాన్సింగ్ క్వీన్’ శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారింది. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సక్సెస్ ప్రమోషన్స్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా నెలసరి (Menstruation) సమయంలో మహిళలు ఎదుర్కొనే శారీరక ఇబ్బందులపై ఆమె మాట్లాడిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘సాకులు చెప్పొద్దు.. చేసే పనికి పీరియడ్స్ అడ్డు కాదని’ శ్రీలీల అనడంతో భారీ ట్రోలింగ్ చేస్తున్నారు. 

ప్రతి మహిళ శరీర నిర్మాణం, ఆరోగ్య పరిస్థితి వేరుగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. కొందరికి నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అలసట, లేదా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో పనిని కొనసాగించడం చాలా కష్టమవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. 

ఉస్తాద్ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీలీల తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. “నా పాటలు చాలా వరకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే, చాలా వరకు పీరియడ్స్ సమయంలోనే షూటింగ్‌లలో పాల్గొన్నాను. ముఖ్యంగా డ్యాన్స్ లాంటి ఫిజికల్‌గా డిమాండింగ్ పనులు సైతం చేశాను. అందువల్ల, మహిళలు సమానత్వం కోరుకుంటే శారీరక పరిమితులను అధిగమించాల్సిన అవసరం ఉంది ” అని శ్రీలీల అన్నారు.

ఈ క్రమంలోనే శారీరక ఇబ్బందులను సాకులుగా చూపకూడదు. మానసిక, శారీరక అడ్డంకులు దేనికీ సాకులు కాకూడదని నేను నమ్ముతాను అని శ్రీలీల వీడియోలో చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, పలువురు నెటిజన్లు ఆమె మాటలను విమర్శించారు. పీరియడ్స్ అనుభవం ప్రతి మహిళకు భిన్నంగా ఉంటుందని, కొందరికి తీవ్రమైన నొప్పి, అలసట, లేదా PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని వారు పేర్కొన్నారు.

ముఖ్యంగా, శ్రీలీల MBBS పూర్తి చేసిన డాక్టర్ కావడంతో, ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా ఇంత సున్నితమైన విషయాన్ని జనరలైజ్ చేయడం ఏంటని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తూ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే.. శ్రీలీల చేసిన వ్యాఖ్యలపై వస్తున్న రియాక్షన్స్, రెండు కోణాల్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ క్రిటిక్స్ తెలుపుతున్నారు. మొదటగా.. శ్రీలీల చెప్పింది తన వ్యక్తిగత అనుభవం అని గుర్తించాలని అంటున్నారు. షూటింగ్స్ సమయంలో, ముఖ్యంగా డ్యాన్స్ చేసేటపుడు పీరియడ్స్ వచ్చిన కూడా షూటింగ్ ఆపకుండా కొనసాగానని చెప్పింది. ఇది ఆమె డెడికేషన్ ని చూపిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి కష్టాలు చాలామంది ఎదుర్కొంటారని అంటున్నారు.

కానీ రెండో కోణం.. అదే ఇప్పుడు వివాదానికి కారణం. ప్రతి మహిళకు పీరియడ్స్ అనుభవం ఒకేలా ఉండదు. కొందరికి సాధారణంగా ఉంటే, మరికొందరికి తీవ్రమైన నొప్పి, అలసట, హార్మోనల్ సమస్యలు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఇది Dysmenorrhea (నొప్పితో కూడిన రుతుస్రావం) లేదా ఎండోమెట్రియోసిస్ లాంటి పరిస్థితుల వల్ల మరింత కష్టం అవుతుంది. అందువల్ల జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సిందని చెబుతున్నారు. 

ఇకపోతే, ఇపుడు శ్రీలీల కామెంట్స్పై సోషల్ మీడియాలో చాలా మంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే “పీరియడ్స్ టైంలో డ్యాన్స్ చేయడం నీ స్ట్రెంగ్త్ కి సంబంధించింది. కానీ, అందరికీ అదే స్టాండర్డ్‌గా చెప్పడం సరైంది కాదు” అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తానికి, శ్రీలీల ఉద్దేశం ప్రేరణ ఇవ్వడమే కావచ్చు. కానీ అలాంటి సున్నితమైన విషయాల్లో సమతుల్యంగా మాట్లాడడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.