- ఇందుకోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలి : తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ
భద్రాచలం, వెలుగు : రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన ఎటపాక, గుండాల, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, పిచ్చుకులపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు. భద్రాచలంలోని హరిత ఫంక్షన్ హాల్‌లో గురువారం జేఏసీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల విలీనం వల్ల భద్రాచలంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేలా పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ నెల 13వ తేదీన భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ పూనెం కృష్ణ, నాగేశ్వరరావు, తిప్పన సిద్దులు పాల్గొన్నారు.
