హైదరాబాద్, వెలుగు: దేశంలోని బీసీ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించడానికి ఆదివారం విజయవాడలో బీసీల మేధోమథన సదస్సు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తివేత తదితర అంశాలపై త్వరలో ఢిల్లీలో బీసీ గర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు.
బీసీ మేధోమథన సదస్సులో బీసీ మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు, న్యాయమూర్తులు, సామాజిక తత్వవేత్తలు, బీసీ ఉద్యమకారులతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా బీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
