టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ రేసులో కుంబ్లే, లక్ష్మణ్‌‌!

టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ రేసులో కుంబ్లే, లక్ష్మణ్‌‌!

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌‌క తర్వాత టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ పదవి ఖాళీ అవ్వనుంది. దీంతో రవిశాస్త్రి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. అయితే,  లెజెండరీ స్పిన్నర్‌‌ అనిల్‌‌ కుంబ్లే, హైదరాబాదీ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌లో ఒకరికి కోచ్‌‌ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.  ఈ మేరకు కుంబ్లే, లక్ష్మణ్‌‌తో బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ మాట్లాడే అవకాశముందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 2016–17 మధ్య కుంబ్లే ఇండియా కోచ్‌‌గా పని చేశాడు. 2017  చాంపియన్స్‌‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌‌ చేతిలో  ఓటమి తర్వాత  తన పదవికి రాజీనామా చేశాడు. విరాట్‌‌ కోహ్లీతో ఉన్న విభేదాలే ఇందుకు కారణమని ఇప్పటికీ చర్చ ఉంది. మరోపక్క సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ మెంటార్‌‌గా లక్ష్మణ్‌‌  కొన్నేళ్లుగా ఆ జట్టును బాగా మేనేజ్‌‌ చేస్తున్నాడు.  దీంతో వీరిద్దరి పేర్లు బోర్డు పెద్దల లిస్ట్‌‌లో ముందు వరుసలో ఉన్నాయి. అయితే, లక్ష్మణ్‌‌ కంటే కుంబ్లే రేసులో ముందున్నట్లు  తెలుస్తోంది. అయితే, టీమిండియా బాధ్యతలు మళ్లీ అందుకునేందుకు కుంబ్లే ఒప్పుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు, ప్రస్తుత బ్యాటింగ్‌‌ కోచ్‌‌ విక్రమ్‌‌ రాథోడ్‌‌ కూడా ఆశావాహుల లిస్ట్‌‌లో ఉన్నాడు. కానీ ఇంటర్నేషనల్‌‌ క్రికెటర్‌‌గా తగిన అనుభవం లేని విక్రమ్‌‌కు హెడ్‌‌ కోచ్‌‌ పదవి దక్కకపోవచ్చని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, హెడ్‌‌ కోచ్‌‌గా ఇండియా మాజీ క్రికెటర్లకే తొలి ప్రాధాన్యముంటుందని, వారు కాని పక్షంలోనే ఫారిన్‌‌ కోచ్‌‌లకు చాన్స్‌‌ వెళుతుందని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.