
న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఓ అధికారి మృతి చెందాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఐటీఓ ప్రాంతంలో చోటుచేసుకుంది. మే 14వ తేదీ మంగళవారం ఇన్‌కమ్ ట్యాక్స్ సీఆర్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు.
CR బిల్డింగ్, ITOలోని మూడవ అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారని అధికారి తెలిపారు. భవనంలో చిక్కుకున్న ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారని చెప్పారు.
ఈ ఘటనలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలో పడిపోయిన 46 ఏళ్ల ఓ వ్యక్తిని గుర్తించి వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. మృతి చెందిన వ్యక్తి.. ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.