సోషల్ ఇష్యూ : అందం అంటే అగ్లీ!

సోషల్ ఇష్యూ : అందం అంటే అగ్లీ!

‘అందం అంటే...’ చర్మం తెల్లగా మెరుస్తూ, బాడీ స్లిమ్​గా ఉండి, యూత్​ఫుల్​ లుక్​తో ఉండడం. అలాగయితే, తెల్లగా లేనివాళ్లు, లావుగా ఉన్నవాళ్లు, నడి వయసు వాళ్లంతా అందంగా లేనట్టేనా? ముమ్మాటికీ కాదు. ‘నువ్వెలా ఉన్నా.. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే ఇతరులు కూడా నిన్ను ఇష్టపడతారు. మనం మార్చలేని వాటిని అంగీకరించాలి’ అంటోంది అనితా భగవాన్​దాస్​.

అనిత ఒక బ్యూటీ జర్నలిస్ట్​. యూకేలో పుట్టి పెరిగిన అనిత స్కిన్​ నలుపు రంగులో ఉండడం వల్ల అవమానాలు ఎదుర్కొంది. ఇతరులను చూసి కొన్ని విషయాలు అర్థం చేసుకుంది. అందంపై రీసెర్చ్ చేసి ‘అగ్లీ’ అనే పుస్తకం రాసింది. ఆ పుస్తకం ఆమె ఎందుకు రాసింది? ఆ పుస్తకంలో ఏముంది? తెలుసుకోవాలంటే ఆమె మాటల్లో ఈ వివరాలు చదవాలి.. ‘‘నేను ఫ్యాషన్ జర్నలిజం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి వాళ్లంతా తెలుపు రంగు చర్మంతో మెరిసిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడున్న పరిస్థితులన్నీ నాకు పూర్తి ఆపోజిట్​లో ఉన్నాయి. కానీ, ఆ ఇండస్ట్రీలోనే నా కెరీర్​ మొదలుపెట్టాలి. అందుకే నేను గమనించిన తేడాని నా మనసుకు అర్థమయ్యేలా చెప్పుకున్నా. ఆ విషయమే బ్యూటీ స్టాండర్డ్స్ గురించి నన్ను ఆలోచించేలా చేసింది. 

నా ప్రొఫెషనల్​ జర్నీలో.. పదిహేనేండ్లుగా బ్యూటీ జర్నలిజంలో ఉన్నా. ఆ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో డార్క్​ స్కిన్​ వాళ్లతో కూడా బ్యూటీ షూటింగ్​ చేద్దామని అడిగా. ‘డార్క్ స్కిన్​ ఉన్నవాళ్లకి మేకప్​ సరిగా పడదు’ అన్నారు అక్కడి వాళ్లు. అంటే తెల్లగా లేనివాళ్లు ఈ రంగం మీద ఆశలు పెట్టుకోకూడదనే కదా అర్థం. దాంతో... అసలు ఈ బ్యూటీ ట్రెండ్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిపై రీసెర్చ్ మొదలుపెట్టా. అది నాకు టర్నింగ్ పాయింట్. అదే ఈ పుస్తకం రాసేలా చేసింది. బ్యూటీ స్టాండర్డ్స్ విషయంలో మనం ఒక లెగసీని ఫాలో అవుతున్నాం. అందువల్లే కాబోలు బ్యూటీ స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది మర్చిపోయాం. ఒకరకంగా చూస్తే... అవి ఎక్కడి నుంచి వచ్చాయనేదే మనం పట్టించుకోలేదు.

‘నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావ్​’ అని ఎవరైనా మొహం మీదే చెప్తే అది మనల్ని బాధపెడుతుంది. ఆ బాధ తీవ్రత ఎంతగా ఉంటుందంటే... ‘అందంగా లేకపోతే నేను బతకడం వేస్ట్​!’ అని అనిపించేంతగా. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకి ‘నిన్ను నువ్వు ప్రేమించుకో’ అని చెప్తే.. ఎలా ఉంటుంది ఊహించండి. ఈ రెండు విషయాల మధ్య చాలా తేడా ఉంది. ఒక మూడ్ నుంచి ఇంకో మూడ్​లోకి మారడం అంత ఈజీ కాదు. కానీ, మారాలి. ఆలోచనా విధానమే మారాలి. రాత్రికి రాత్రే నీ విజన్​ మారిపోవాలి. లేదంటే ఎంతో సాధించాలని ఆశపడే వాళ్లు చాలామంది మొదటి అడుగులోనే ఆగిపోవాల్సి వస్తుంది. ‘నేను ఎందుకు చేయలేను’ అనే మనోబలం రావాలంటే మన ఆలోచనలు మారాలి. ఈ విషయాన్ని నేను ఎక్స్​పీరియెన్స్​ అయి తెలుసుకున్నా.

నా అనుభవాల నుంచే.. 


నేను ఒకసారి బ్యూటీ పార్లర్​కి వెళ్లా. అక్కడ లగ్జరీగా ఉన్న మేకప్ కౌంటర్​లో అరగంట వెయిట్ చేశా. నేను ఒక పక్క వెయిట్​ చేస్తుంటే నా తర్వాత వచ్చిన వాళ్లకి ప్రయారిటీ ఇస్తున్నారు. బ్యూటీ సర్వీస్​లు వాళ్లకు త్వరగా చేసి పంపిస్తున్నారు. అది చాలదన్నట్టు అక్కడున్న అసిస్టెంట్ ఒకరు ‘తెల్లగా కనిపించాలంటే క్రీమ్​ వాడాలని ఒక ఫౌండేషన్​’ని నాకు అంటకట్టింది. ‘చర్మం నల్లగా మారినప్పుడల్లా ఇది రుద్దాలి’ అని ఒక సలహా కూడా ఇచ్చింది. ఇలాంటివి నాకు చాలానే ఎదురయ్యాయి. బ్యూటీ సర్వీసులకి సంబంధించి చాలా చోట్ల నేను ఖర్చు పెట్టే డబ్బుకి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే నేను వాళ్లు కోరుకునే కస్టమర్​ని కాను. కాలేను. వాళ్లు కోరుకునే బ్యూటీ స్టాండర్డ్స్ నాకు లేవు. నా టీనేజ్​లో బ్యూటీ పార్లర్స్​కి వెళ్లినప్పుడల్లా ఇలాంటివి చూడడం అలవాటైపోయింది. అంతెందుకు ఏ షాపులోకి వెళ్లినా, టీవీ అడ్వర్టైజ్​మెంట్స్​, ప్రోగ్రామ్స్, మ్యాగజైన్స్​లో చూసినా డిస్నీ ప్రిన్సెస్​లా అందమైన అమ్మాయిల బొమ్మలే కనిపిస్తాయి. పెద్దవాళ్లే కాదు చిన్నపిల్లలకి కూడా తెలుపు రంగు చర్మం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. చర్మం తెల్లగా, జుట్టు నల్లగా, స్లిమ్​గా ఉండడం​ అనే దగ్గరే ఆగిపోతే, లైఫ్​ చాలా కష్టమైపోతుంది. ఆడుకునే బొమ్మలు కూడా నలుపు రంగువి నాకు ఎక్కడా కనిపించలేదు. టీనేజ్​ పాప్​ స్టార్స్ కూడా తెల్లగా లేదా గోధుమ రంగులో ఉండేవారు. ఇలా ఒక దగ్గర అనే కాదు ఎక్కడికెళ్లినా చర్మం రంగుకి ఇచ్చే విలువ డబ్బుకు లేదనిపించింది. నిజానికి చిన్నప్పటినుంచే పిల్లలకు నలుపు, తెలుపు రంగులు అందానికి కొలమానం కాదనే విషయం చెప్పాలి. లేదంటే తెల్లగా లేకపోతే... అందంగా లేనట్టే అనే అపోహలో ఉండిపోతారు. అలానే పెరిగి పెద్దవారవుతారు.

మా అమ్మ వల్ల తెలిసింది

నా విషయంలో తీసుకుంటే... వృద్ధాప్యం గురించి మా అమ్మ ఎప్పుడూ నాతో చెప్పలేదు. వయసు పెరిగింది. తెల్ల జుట్టు వచ్చేసింది. చర్మం మారింది. శరీరంలో అనేక మార్పులొచ్చాయి అనే ఆలోచనే ఉండేది కాదామెకి. అందుకే యాంటీ ఏజింగ్ క్రీమ్స్​, ట్రీట్​మెంట్స్​ గురించి పట్టించుకోలేదు. మా బంధువుల్లో నాతోటి వయసు వాళ్లు కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. నా టీనేజ్ అయిపోతున్న టైంలో నాకు ఈ విషయాలు తెలిశాయి. కానీ వాటిని యాక్సెప్ట్ చేయాలనిపించలేదు నాకు. మా అమ్మ, నా బంధువులు ఇండియాలో పెరిగారు. నేను యూకేలో పెరిగా. అందుకేనేమో వయసు మీద పడడం అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలనిపించలేదు. దాంతో యాంటీ ఏజింగ్ క్రీమ్​ వాడాలనుకున్నా. ఎప్పుడైతే ఈ క్రీమ్​లు వాడాలి అనిపించిందో అప్పటినుంచే నాలో ముసలిదాన్ని అయిపోతున్నాననే ఆలోచనకు బీజం పడింది. అది తెలియని భారంలా అనిపించేది. కానీ, నాకు 30 ఏండ్ల తర్వాత ముసలితనపు ఛాయలు కనిపించాయి. ఈ విషయంలో నేను చాలా లక్కీ అనుకున్నా. 

ఇదంతా చదివాక ‘నీ పోరాటం దేనిమీద?’ అని మీరు అడగొచ్చు. పాశ్చాత్య దేశాల్లో రంగు విషయంలో ఉన్న ఈ రకమైన ధోరణి ఆడవాళ్లలో న్యూనతకి కారణం అవుతోంది. ఇండియాలో ఉన్న మా అమ్మ... వయసు గురించి పట్టించుకోకుండా లైఫ్​ లీడ్​ చేస్తోంది. కానీ ఇక్కడ మాత్రం వయసు దాచేసేందుకు రకరకాల ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? నిజానికి వయసు పెరగడం అనేది ఎంతో గౌరవమైనది అని నా అభిప్రాయం. ఇది ఆసియాలో చాలావరకు కల్చర్​కి సంబంధించిన విషయం. అదే జపాన్​లో చూస్తే కళలు, సంస్కృతీ సంప్రదాయాలను పాటించడంలో ఆరితేరిన వాళ్లకు ‘లివింగ్ నేషనల్ ట్రెజర్’ అని బిరుదు కూడా ఇస్తారు. ‘30 అండర్30’ పేరుతో యూత్ సెలబ్రేట్ చేసుకుంటారు. ట్రావెల్ ట్రెండ్స్​ కూడా​ మధ్య వయసు వాళ్లలోనే ఎక్కువ కనిపిస్తాయి. వాళ్ల దగ్గర ట్రిప్స్​ వెళ్లేందుకు పెద్ద లిస్ట్​ ఉంటుంది.

నిన్ను నువ్వు నమ్మాలి

ప్రస్తుతం పెద్ద సిటీల్లోని సెలూన్స్​లో డార్క్ స్కిన్ వాళ్లకు తగ్గ మేకప్ దొరుకుతోంది. స్పెషల్​గా ట్రైన్​ అయిన మేకప్ ఆర్టిస్ట్​లు, స్టయిలిష్ట్​లు కూడా ఉన్నారు. 90లతో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితులు చాలావరకు మారాయి. కానీ, ‘అందం’ అనే ఈక్వేషన్​ మీద రకరకాల ప్రొడక్ట్స్​ మనకు అమ్ముతూనే ఉన్నారు. మీకో ఉదాహరణ చెప్తా టిక్​టాక్​లో ‘వెనిలా గర్ల్’ అనే అకౌంట్​కి మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉంటాయి. అంటే... తెల్లగా ఉన్న వాళ్లకే పాపులారిటీ దక్కుతుందన్నమాట. ఇలాంటివి చూసి ‘‘నేను అందంగా పుట్టలేదు. అందుకని సోషల్​ మీడియాలో పాపులర్ కాలేను’’ అని నిరాశపడాల్సిన అవసరం లేదు. అలా అనుకునే వాళ్లకోసమే ‘అగ్లీ’ అనే పుస్తకం రాశా. ఒకప్పుడు నేను అందం అంటే రంగులో, బాడీ షేప్​లో ఉందని బాధపడినట్టు, బాధపడుతున్న వాళ్ల కోసమే ఈ పుస్తకం. అందంతో మన బంధం ఎప్పటికీ ఒక ఫెస్టివల్​లా ఉండాలి. అందులో దొరికే సంతోషం మరెక్కడా దొరకదు. ‘నిన్ను నువ్వుగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైనా చేయగలవు’ అంటాను నేను. ఇలాంటి విషయాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.’’

అందానికి అర్థం 

కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకుని, వాటిని నమ్మడానికి చాలా కష్టం అవుతుంది. అదెలాగో అర్థం కావాలంటే ఒక విషయం చెప్పుకుందాం... మన బాడీని మనం యాక్సెప్ట్ చేసే గుణం ఉంటుంది. కానీ, పక్కవాళ్లని చూడగానే ‘సన్నగా ఉన్నావు’, ‘కాస్త లావయ్యావు’ అంటుంటాం. వందల ఏండ్ల నుంచి ఇదొక ట్రెండ్ అయిపోయింది​. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. అందం కోసం యూరోపియన్లు అనేక మార్గాలు వెతికారని తెలిసింది. అందులో కొకేజియన్ బ్యూటీని క్రియేట్​ చేయడం ఒకటి. కొకేజియన్ అంటే... తెలుపు రంగు చర్మం ఉండడం. సన్నగా ఉండడం. అలా లేకపోతే అసహ్యంగా ఉన్నట్టా! ఇప్పటికీ అందానికి అర్థం ఏంటంటే... తెల్లగా, సన్నగా ఉండడం అని భావిస్తున్నాం. అలా కాకుండా ‘నువ్వెలా ఉన్నావో అలా యాక్సెప్ట్ చేస్తున్నావా? లేదా?’ అనేది నీ ఛాయిస్.