
సోషల్ మీడియాను ఇప్పుడున్న జనరేషన్ చాలా తెలివిగా వాడుకుంటోంది. అందులో కైలీ జెన్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ టీవీ స్టార్.. వేల కోట్లకు పడగెత్తింది. అదీ కేవలం కాస్మొటిక్స్, బ్యూటీ ప్రొడక్టులను అమ్ముకుంటూ. ఇరవై ఏళ్లకే బిలియనీర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పిన ఈమె.. ఇప్పుడు ఏకంగా భారీ బిజినెస్ డీల్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
కైలీ జెన్నర్.. మోడలింగ్ ప్రపంచపు రారాణి. కోట్లాది మంది అమ్మాయిలకు ఫ్యాషన్ ఐకాన్. ఈమె ఫేస్‌బుక్ ఫాలోయర్ల సంఖ్య రెండు కోట్లకు పైనే. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 కోట్లకుపైనే ఫాలోయర్స్ ఉన్నారు. ట్విట్టర్ ఫాలోయర్స్ కౌంట్ దాదాపు మూడు కోట్లు. ఈ ఫాలోయర్స్ అంతా ఆమె పోస్టుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆమె ప్రొడక్టులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. బ్యూటీ ప్రొడక్టులకు సంబంధించిన పోస్టులతో పాటు.. ఆమె అందమైన ఫోజులు ఫాలోయర్స్‌కి బోనస్. కర్దాషియన్ ఫ్యామిలీ మెంబర్‌గా ఐడెంటిటీ ఉన్నప్పటికీ తెలివితేటలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకుంది కైలీ జెన్నర్.
క్విక్ సక్సెస్
కైలీ జెన్నర్.. పదేళ్ల వయసులోనే రియాలిటీ షో ద్వారా ఈ పేరు ప్రపంచానికి పరిచయమైంది. చిన్న వయసులోనే మోడల్‌గా మారింది. పద్నాలుగేళ్ల వయసులో అక్క కెన్డాల్ జెన్నర్‌తో కలిసి కైలీ, క్లోతింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడి నుంచి సోషల్ మీడియాలో జెన్నర్ సిస్టర్స్ హవా నడుస్తూనే ఉంది. అందుకే 2014, 2015లో టైమ్ మేగజీన్ మోస్ట్ ఇన్‌ప్లుయెన్స్ టీన్స్‌గా జెన్నర్ సిస్టర్స్‌తో కలిసి గుర్తింపు దక్కించుకుంది కైలీ. మోడలింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో 2015లో కైలీ సొంతంగా ‘కైలీ లిప్ కిట్స్’ బ్రాండ్‌ను ప్రారంభించింది. వాటిని సోషల్ మీడియా అకౌంట్స్‌లో ప్రమోట్ చేసుకుంది. ఆశ్చర్యంగా నిమిషాల్లోనే వేల కొద్దీ కిట్స్ అమ్ముడుపోయాయి. మార్కెటింగ్ రంగంలో ఈ రికార్డు ఇప్పటిదాకా చెరిగిపోలేదు. ప్రొడక్టుల ప్రచారం కోసం ఆమె చేసే స్ట్రాటజీ.. జస్ట్ ఫొటోలతో పోస్టులు పెట్టడం. తర్వాత మరికొన్ని ప్రొడక్టులను చేర్చి ‘కైలీ కాస్మొటిక్స్’ పేరుతో అమ్మకాల్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్‌లో ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.
ఆ ఫాలోయింగ్ కారణంగానే ఫోర్బ్స్ సెలబ్రిటీ లిస్టులో చోటు సంపాదించుకుందామె. 2018లో ఆమె కంపెనీ రెవెన్యూ 360 మిలియన్ డాలర్లు. ఈ ఏడాది మొదట్లో కైలీ సంపాదన ఒక బిలియన్ యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో ఫోర్బ్స్ మేగజీన్ ఆమెకు ‘వరల్డ్ యంగెస్ట్ బిలియనీర్’గా గుర్తింపు ఇచ్చింది. అప్పటికీ ఆమెతో కలిపి కంపెనీలో ఏడుగురు ఉద్యోగులు మాత్రమే ఉండటం కొసమెరుపు. రీసెంట్‌గా అమెరికన్ మల్టీనేషనల్ బ్యూటీ కంపెనీ ‘కాటీ’ జెన్నర్‌తో ఒక ఒప్పందం చేసుకుంది. కైలీ కాస్మొటిక్స్ కంపెనీ నుంచి 51 శాతం వాటా కొనుగోలు చేసింది. డీల్ మొత్తం విలువ 1.2 బిలియన్ డాలర్లు. అందులో కైలీ జెన్నర్‌కి దక్కిన వాటా 600 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఇది నలభై మూడు వేల కోట్లకు పైనే. ఇరవై రెండేళ్ల వయసులో ఇంత పెద్ద డీల్ ద్వారా సెన్సేషన్ సృష్టించింది కైలీ. అయితే మేజర్ షేర్ అమ్ముకున్నప్పటికీ ఆమె బిలీయనీర్ పొజిషన్ ఏమాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం.
కాంట్రవర్సీలు
ఇన్‌స్టాగ్రామ్‌లో సెకండ్ మోస్ట్ ఫాలోడ్ బ్రాండ్. దీని ఆధారంగా ఫోర్బ్స్ ‘యంగెస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్’గా గుర్తింపు ఇచ్చింది. అయితే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెకి ఈ హోదా ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకించారు. అయితే వారసత్వంగా తనకు పైసా కూడా దక్కలేదని.. మోడలింగ్ సంపాదనతోనే వ్యాపారం చేస్తున్నట్లు ఆడిటింగ్‌తో సహా వివరణ ఇచ్చి విమర్శకుల నోళ్ళు మూయించింది కైలీ. 2017లో ఆస్ట్రేలియన్ సింగర్ కైలీ మినోగు ‘కైలీ’ ట్రేడ్‌మార్క్ గురించి జెన్నర్‌తో న్యాయపోరాటం చేసింది. ఈ కేసులో మినోగు గెలవడంతో జెన్నర్ భారీ నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఆస్ట్రేలియన్ సింగర్ కోడీ సింప్సన్, ర్యాపర్ టైగాలతో డేటింగ్ చేసిన జెన్నర్.. ఆ తర్వాత ట్రావిస్ స్కాట్‌తో ఏకంగా సహజీవనం చేసింది. 2017లో అంటే తన ఇరవై ఏళ్ల వయసులో జెన్నర్ ఒక బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి అయ్యాక జెన్నర్ హాట్ హాట్ పోజులతో ఫొటోలు పోస్ట్ చేయడం విమర్శలకు దారి తీసింది. అదే టైంలో ఆమె పాపులారిటీ గణనీయంగా పెరగడం విశేషం. మొన్న సెప్టెంబర్‌లో ట్రావిస్‌కి బ్రేకప్ చెప్పిన జెన్నర్.. ప్రస్తుతం సింగిల్ మదర్‌గా, సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ఉమెన్‌గా రాణిస్తోంది.
ఉమ్మడి ఫ్యామిలీ షో
ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఫ్యామిలీ ఏదైనా ఉందీ అంటే అది జెన్నర్ ఫ్యామిలీనే. కైలీ వంశవృక్షం(ఫ్యామిలీ ట్రీ) చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కైలీ పేరెంట్స్ బ్రూస్ జెన్నర్, తల్లి క్రిస్ జెన్నర్. 1997లో ఈ జంటకు కవల పిల్లలు పుట్టారు. వాళ్లే కైలీ, కెన్డాల్‌లు. క్రిస్ పాపులర్ టీవీ యాంకర్. బ్రూస్ 1976 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్. అయితే పిల్లలు పుట్టిన కొన్నేళ్లకు సర్జరీ ద్వారా ట్రాన్స్ ఉమెన్‌గా మారాడు. అప్పటి నుంచి బ్రూస్ పేరు కైట్లీన్ జెన్నర్‌గా మారింది. దీంతో క్రిస్ విడాకులిచ్చింది. అయినా వాళ్లు కలిసే ఉంటున్నారు. అయితే క్రిస్‌కి బ్రూస్(కైట్లీన్) రెండో భర్త. ఆమె మొదటి భర్త రాబర్ట్ కర్దాషియన్. ఈయన అమెరికాలో ఒక ప్రముఖ వ్యాపారవేత్త, లాయర్ కూడా. రాబర్ట్–క్రిస్‌లకు కలిగిన సంతానమే కౌర్‌ట్నీ కర్దాషియన్, కిమ్ కర్దాషియన్, ఖోలే కర్దాషియన్, కొడుకు రాబ్ కర్దాషియన్లు. 1991లో రాబర్ట్–క్రిస్‌లు విడిపోయారు. అప్పటి నుంచి పిల్లలందరూ క్రిస్‌తోనే ఉంటున్నారు. కర్దాషియన్ సిస్టర్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. దీంతో కర్దాషియన్ ఫ్యామిలీతో కలిసి ఒక రియాలిటీ షో ప్లాన్ చేశాడు ర్యాన్ సీక్రెస్ట్. అలా 2007లో ‘కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్’ టీవీ సిరీస్ మొదలైంది. కిమ్ ఫ్యామిలీతో పాటు జెన్నర్ ఫ్యామిలీ కూడా ఈ షోలో పాల్గొంటోంది. ఆన్ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ గ్లామర్ సిస్టర్స్ మధ్య అన్యోన్యత మామూలుగా ఉండదు. కర్దాషియన్, జెన్నర్ సిస్టర్స్ బాయ్ ఫ్రెండ్స్, మాజీ బాయ్ ఫ్రెండ్స్, భర్తలు, మాజీ భర్తలు.. ఇలా అంతా ఈ షోలో పాల్గొంటుండటంతో ఆడియెన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. 17 సీజన్లు.. 247 ఎపిసోడ్స్‌తో ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది ఈ రియాలిటీ షో.
కైలీ పవర్ అది
కైలీ జెన్నర్ పోస్టులు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయంటే.. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె చేసిన ఒక్క ట్వీట్ పెద్ద కలకలం రేపింది. స్నాప్‌చాట్ యాప్‌కి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేసింది. ఆ దెబ్బకు షేర్‌చాట్ మార్కెట్ కుప్పకూలింది. అయితే అంతలోనే తాను సరదాగా ఆ ట్వీట్ చేశానని చెబుతూ.. ఈసారి స్నాప్ చాట్‌కి పాజిటివ్‌గా ఇంకో ట్వీట్ చేసింది. కానీ, ఈ గ్యాప్‌లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్నాప్‌చాట్ షేర్లు కుప్పకూలిపోయాయి. ఆ నష్టం విలువ ఏడు వేల కోట్లకు పైనే. ఇది కేవలం ఆమె ట్విట్టర్ ఫాలోయింగ్ ఎఫెక్ట్ మాత్రమే.