నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. రెండు రోజుల కిందట రష్యా తన వద్ద ఉన్న బంగారం కూడా అమ్ముకుంటోందనే వార్త కూడా బయటకు వచ్చింది. ఈ తరుణంలో ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అల్యూమినియం దిగ్గజం 'రుసల్' వ్యవస్థాపకుడు ఒలేగ్ డెరిపాస్కా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కేవలం తాత్కాలిక మందగమనం కావని, ఇది ఒక ప్రాథమిక మార్పని పేర్కొన్నారు. ఈ గడ్డు కాలాన్ని అధిగమించాలంటే రష్యా ఉద్యోగులు తమ పని గంటలను భారీగా పెంచుకోవాలని, వారానికి 6 రోజులు కష్టపడాలని అన్నారు. రష్యా అంతర్జాతీయ అవకాశాల నుంచి ప్రాంతీయ పరిమితుల వైపు మళ్లుతున్న వేళ.. కష్టపడి పనిచేయటం ఒక్కటే మిగిలిన ఉన్న మార్గమని స్పష్టం చేశారు.
రష్యా ఎంత త్వరగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల పని వేళలకు అది కూడా సోమవారం నుంచి శనివారం వరకూ పద్దతిలోకి మారితే అంత వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందంటూ డెరిపాస్కా తన టెలిగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. కష్టకాలంలో రష్యన్లు తమ శక్తియుక్తులతో మరింత కష్టపడి పనిచేయడం జాతీయ లక్షణమని గుర్తు చేశారు. ప్రస్తుతం రష్యాపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలు, మారుతున్న వాణిజ్య మార్గాల వల్ల దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని, దీనిని చక్కదిద్దాలంటే ప్రొడక్టివిటీని పెంచక తప్పదంటూ పేర్కొన్నారు.
రష్యా ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. 2024లో 4.3 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు, 2025 నాటికి కేవలం 1 శాతానికి పడిపోయింది. రష్యా బడ్జెట్‌లో మూడో వంతు ఆదాయం చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచే వస్తుంది. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో అడ్డంకుల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటి, ఏడాదిలో 70 శాతానికి పైగా పెరగడం రష్యాకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అమెరికా ఆంక్షలతో చానాళ్లుగా తక్కువ రేట్లకు క్రూడ్ అమ్ముకుంటున్న రష్యాకు ప్రస్తుతం పెరిగిన రేట్లు కలిసొస్తున్నాయి.
గల్ఫ్ యుద్ధం వేళ అమెరికా కొన్ని రష్యా షిప్‌మెంట్లపై పరిమిత ఆంక్షల మినహాయింపులు ఇవ్వడం వల్ల మార్పులు వస్తున్నాయి. ఇటువంటి అస్థిర పరిస్థితుల్లో రష్యా తన ఆర్థిక పునాదులను పటిష్టం చేసుకోవాలంటే.. ప్రజలు తమ విలాసాలను పక్కనపెట్టి ఎక్కువ పని గంటలకు సిద్ధపడాలని డెరిపాస్కా సూచిస్తున్నారు. ఈ 12 గంటల షిఫ్ట్ ప్రతిపాదన ఇప్పుడు రష్యా కార్మిక వర్గంలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక పరివర్తన కోసం ప్రజల వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేయాలన్న ఈ పిలుపు ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాల్సిన విషయమే.
