సాధారణంగా ఎవరికైనా పుట్టిన రోజు ఒకేసారి వస్తుంది. కానీ హనుమంతుడికి మాత్రం రెండు సార్లు వస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు ఆయన జయంతిని రెండు సార్లు జరుపుకుంటారు? ఆయన జయంతి రోజు హనుమాన్ కృపను పొందాలంటే ఎలా పూజించాలి? పురాణాల్లో హనుమంతుడి పుట్టిన రోజు గురించి ఏముంది.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
పురాణాల ప్రకారం హనుమంతుడికి రెండు సార్లు జయంతి వస్తుంది. చైత్ర పౌర్ణమి మరియు వైశాఖ బహుళ దశమి రోజులలో జరుపుకుంటారు. ఈ రోజుల్లో హనుమంతుడిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఉత్తర భారతదేశంలో చైత్రపౌర్ణమి రోజున హనుమంతుడి పుట్టిన రోజును హనుమజ్జయంతిగా జరుపుకుంటారు. తెలంగాణలోని హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉత్తరాది వారు పెద్ద సంఖ్యలో స్థిరపడటంతో ... ఇక్కడ కూడా చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
చైత్ర పౌర్ణమి హనుమజ్జయంతి శుభ ఘడియలు
ఈ ఏడాది (2026) చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై... ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 7:41 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథి (సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే ఆ రోజే పండుగ) పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు.
చైత్ర పౌర్ణమి .. హనుమజ్జయంతి వెనుకున్న పురాణ కథ
బాల హనుమంతుడు...సూర్యుడిని పండుగా భావించి తిందామని... ఆకాశంలోకి ఎగిరిన సమయంలో ఇంద్రుడి వజ్రాయుధంతో దాడి చేయగా మూర్ఛపోతాడు. అప్పుడు వాయుదేవుడు ఆగ్రహించి సృష్టిలో గాలిని స్తంభింపజేస్తాడు. పరిస్థితిని గమనించిన బ్రహ్మదేవుడు వచ్చి మూర్ఛపోయిన హనుమంతుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని నిమరగా.. ఆయన తిరిగి స్పృహలోకి వచ్చాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.అలా హనుమంతుడు మళ్లీ పుట్టాడని .. ఆరోజు చైత్ర పౌర్ణమి కావడంతో .. ఆ రోజును కూడా హనుమాన్ జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
హనుమజ్జయంతి పూజా విధానం:
- చైత్ర పౌర్ణమి రోజున ( ఏప్రిల్ 2) ఉదయాన్నే తల స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్దం కావాలి.
- హనుమంతుడికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. ఇంట్లో పూజ చేసుకోవాలంటే స్వామివారి విగ్రహానికి ఫోటోకు సిందూరం అర్పించాలి.
- కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవారు కలశం పెట్టుకోవచ్చు. లేకపోయినా కూడా పూజ చేసుకోవచ్చు.
- ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
- షోడశ పూజలు చేసి అనంతరం హనుమాన్ చాలీసా పఠించాలి
- ఓం హనుమతే నమః .. శ్రీ రామ దూతాయ నమః అనే మంత్రాలను జపించాలి
- బెల్లం, అరటిపండ్లు, వడపప్పు, పానకం,తమలపాకులను, వడలు, నేతి అప్పాలు మీ శక్తి మేరకు సమర్పించాలి.
- ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఈ విధంగా స్వామి వారిని పూజిస్తే ఆయన కరుణ కటాక్షాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
- ఒకవేళ ఇంట్లో పూజించలేకపోతే గుడికి వెళ్లి మీ శక్తి మేరకు పూజించండి. . . ఇలా చేస్తే ఆ స్వామి వారి కరుణకు పాత్రులవుతారు.
హనుమాన్ చాలీసా108 సార్లు చదివితే కలిగే ఫలితం ఇదే..!
హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహదోషాలు ఉన్నవారు ఇలా మొక్కుకుని చేయాలి. ఎవరైతే ఆ రోజు ( ఏప్రిల్ 2) 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారో వారికి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
- ఈ విధంగా పారాయణ చేస్తే మనసులోని తెలియని ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి.
- చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది.
- నెగటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
