అక్కడ రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాహనాలు ఏం తిరగట్లేదు. కానీ, గూగుల్ మ్యాప్స్‌లో మాత్రం ‘ట్రాఫిక్ జాం’ అన్న అప్డేట్లు కనిపిస్తున్నాయి. అరె, ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ జామా? అదెట్లబ్బా..! అనుకుంటున్నారా..? ఓ ఆర్టిస్ట్ చేసిన ఓ చిన్న ట్రిక్ మహిమ అది! ఎవరా ఆర్టిస్ట్.. ఏం చేశాడో చెప్పు బాసూ అంటారా.. ఓకే.. ఓకే! అది జరిగింది జర్మనీ రాజధాని బెర్లిన్‌లో. సైమన్ వెకర్ట్ అనే ఆర్టిస్ట్ బుర్రలో గూగుల్ మ్యాప్స్‌ను ట్రిక్ చేద్దాం అన్న ఓ చిన్న చిలిపి ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా ఫ్రెండ్స్ దగ్గర సెకండ్ హ్యాండ్ ఫోన్లు తీసుకున్నాడు. స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి మరికొన్ని ఫోన్లను రెంటుకు తెచ్చుకున్నాడు. మొత్తం 99 ఫోన్లు లెక్క తేలింది. వాటన్నింటిలో తాను వెళ్లాలనుకున్న చోటుకు గూగుల్ మ్యాప్స్‌లో డ్రైవింగ్ డైరెక్షన్‌ను సెట్ చేశాడు. తర్వాత వాటిని ఓ చిన్న ప్లాస్టిక్ కార్టులో వేశాడు. దానికో తాడు కట్టాడు. ఆ తాడు పట్టుకుని బెర్లిన్‌లోని కొన్ని వీధులు తిరిగాడు. అంతే, అక్కడ వాహనాలు ఏం తిరగకపోయినా, ఆ మహానుభావుడు ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయినట్టు చూపించేసింది గూగుల్ మ్యాప్స్!! ఆ వీడియోను మొత్తం అతగాడు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో వైరల్ అయిపోయింది. అయితే, గూగుల్ కూడా అతడు చేసిన దానికి ఫన్నీగానే స్పందించింది. ‘‘కారు కావొచ్చు.. కార్ట్ కావొచ్చు.. గూగుల్ మ్యాప్స్‌ను క్రియేటివ్‌గా వాడుకోవడాన్ని మేమూ ఇష్టపడతాం. మున్ముందు మ్యాప్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఇలాంటివి మాకు బాగా ఉపయోగపడతాయి’’ అని గూగుల్ అధికారి ఒకరు చెప్పారు.
