రామయ్య పెళ్లికొడుకాయనే..

రామయ్య పెళ్లికొడుకాయనే..
  •     భద్రాచలంలో వైభవంగా  డోలోత్సవం, వసంతోత్సవం
  •     పసుపు కొట్టి తలంబ్రాలు కలిపి శ్రీరామనవమి పనులు షురూ 
  •     ఆన్​లైన్​లో సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం టిక్కెట్లు

భద్రాచలం,వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టం హోలీ వేళ సోమవారం ఆవిష్కృతమైంది. రామయ్యకు పంచామృతాలతో అభిషేకం, సహస్రధారలతో స్నపన తిరుమంజనం చేసి పెళ్లికొడుకుగా తయారు చేశారు. బేడా మండపంలో పూలతో అలంకరించిన ఊయలలో సీతారాములను ఆశీనులను చేసి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ముందుగా గర్భగుడిలో మూలవరులు, లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారిపై..తర్వాత బేడా మండపంలో ఉన్న సీతారాముల ఉత్సవమూర్తులపై రంగులు చల్లారు. 

ఇదే సమయంలో భక్తులపైనా పసుపు నీళ్లు, రంగులు చల్లారు. వసంత రామయ్యకు నక్షత్ర, కుంభహారతులను సమర్పించారు. తర్వాత బేడా మండపం నుంచి సీతారాములను ఊరేగింపుగా ఉత్తరద్వారం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రోలు, రోకలికి పూజలు చేశారు. పసుపు కొమ్ములను కొట్టి వచ్చే నెల 9వ తేదీన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవ పనులకు శ్రీకారం చుట్టారు. మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి వినియోగించే తలంబ్రాలను కలిపే పనులను ఈవో రమాదేవి ప్రారంభించారు. 

హోళీ వేడుకల దృష్ట్యా స్వామికి నిర్వహించే నిత్య కల్యాణం, సోమవారం నాటి ముత్తంగి సేవలను నిలిపివేశారు. తిరుమల తిరుపతి సేవా కుటుంబం ఆధ్వర్యంలో భద్రాద్రి రామయ్యకు సేవా కుటుంబ సభ్యులు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోని భక్తులు గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు అన్నదానం కోసం 108 బస్తాల ధాన్యాన్ని ఇచ్చారు. ముందుగా సీతమ్మవారికి సారె ఇచ్చారు. గత ఏడాది భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 250 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయగా, ఈసారి 300 క్వింటాళ్ల తలంబ్రాల ప్యాకెట్లను ఇవ్వాలని నిర్ణయించారు. సాయంత్రం శ్రీసీతారామచంద్రస్వామికి తిరువీధి సేవను చేశారు.

ఆన్​లైన్​లో టిక్కెట్లు

ఏప్రిల్17న జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 18న జరిగే పట్టాభిషేకం టికెట్లను సోమవారం నుంచి ఆన్​లైన్​లో పెట్టారు.  <http://bhadradritemple.telangana.gov.in> అనే వెబ్​సైట్​లో టికెట్లు పొందవచ్చని ఈవో రమాదేవి తెలిపారు. శ్రీరామనవమి రోజున ఉభయ దాతల టికెట్​ధర రూ.7500 కాగా దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లపై ఒక్కరికే ప్రవేశం ఉంటుంది. 18న జరిగే శ్రీరామ పట్టాభిషేకం సెక్టార్​ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు.