లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అతిగా వ్యవహరిస్తోంది: కేజ్రీవాల్​

లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అతిగా వ్యవహరిస్తోంది: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ)ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ఇందుకు తన అరెస్టే నిదర్శనమని లిక్కర్​ పాలసీ కేసులో అరెస్టై తీహార్​ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​అన్నారు. ఈ కేసులో ఈడీ అతిగా వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టుకు చెప్పారు. లోక్​సభ ఎన్నికల ముందు తనను అరెస్ట్​ చేయడం ద్వారా ఏకపక్షంగా నడుచుకున్నదని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో ఈడీ తనను అరెస్ట్​ చేయడాన్ని సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్​పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు ఈడీని సమాధానం కోరింది. ఈడీ అఫిడవిట్​ దాఖలు చేయగా, దానిపై శనివారం కేజ్రీవాల్​ స్పందించారు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు.

ఎన్నికల వేళ అణచివేసేందుకు కుట్ర

లోక్​సభ ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని, మనీలాండరింగ్​ యాక్ట్​ను దుర్వినియోగం చేస్తున్నదని కేజ్రీవాల్​ తెలిపారు. లోక్​సభ ఎలక్షన్​ షెడ్యూల్​విడుదల కాకముందే.. ఎన్నికల కోడ్​ అమల్లోకి రాకముందే తనను అరెస్ట్​ చేసిన తీరు ఈడీ ఏకపక్ష వైఖరికి అద్దంపడుతోందన్నారు. దర్యాప్తు సంస్థను అడ్డంపెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో పైచేయి సాధిస్తోందని ఆరోపించారు.

 అలాగే, దర్యాప్తు సమయంలో ఈడీ ప్రవర్తన చట్టబద్ధమైన ప్రక్రియను విస్మరించిందని చెప్పారు. ఈ కేసులో ఎలాంటి తప్పుచేయలేదని సహనిందుతులు చెప్పిన విషయాన్ని ఈడీ అధికారులు దాచిపెట్టారని అన్నారు. తాను తప్పుచేసినట్టు వారి వద్ద ఒక్క ఆధారంకూడా లేదని చెప్పారు.  తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కేజ్రీవాల్​ అఫిడవిట్​లో పేర్కొన్నారు.