
‘సినిమా నచ్చితే సొంత భాష కథా, పొరుగు భాష కథా అని ప్రేక్షకులు పట్టించుకోరు కాబట్టే తన రీమేక్ సినిమాలన్నీ మెప్పించాయి’ అంటున్నారు రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు. ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’ గురించి ఆయన చెప్పి న విశేషాలు.
- ఎక్కువశాతం రివ్యూలు పాజిటివ్‌గా రావడం సినిమాకి ప్లస్ అయింది. హృదయానికి హత్తుకునేలా, స్ఫూర్తినిచ్చేలా ఉందంటున్నారు. సుబ్బిరామిరెడ్డి లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు అభినందించారు. నా కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అని నమ్ముతున్నాను.
- కెరీర్ ప్రారంభంలో మంచి చిత్రాలు చేశాను. తర్వాత విజయాలు తగ్గినా ‘సుడిగాడు’తో ‘సుస్వాగతం’ స్థాయి సక్సెస్ అందుకున్నాను. కానీ అది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. రియలిస్టిక్‌గా, నేచురల్‌గా ఉండే చిత్రాల్ని ఇష్టపడుతున్నారు.
- క్రికెట్ నేపథ్యంలో జెర్సీ, మజిలీ లాంటి చిత్రాలొచ్చినా వాటికి భిన్నమైన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఓవైపు క్రీడా స్ఫూర్తి, మరోవైపు రైతుల సమస్యలను బ్యాలెన్స్ చేస్తూ తీశాం.
- తమిళంలో ఈ సినిమాను నిర్మించడమే కాక కీలక పాత్ర పోషించారు శివకార్తికేయన్. ఆ పాత్రపై ఉన్న ప్యాషన్‌తో తెలుగులోనూ తానే పోషిస్తానని రిక్వెస్ట్ చేశారు.
- సినిమా నచ్చితే రీమేకా, ఒరిజినలా అని ప్రేక్షకులు పట్టించుకోరు. అందుకే డబ్బింగ్ సినిమాలు సైతం హిట్ అవుతున్నాయి. ఓ ప్రేక్షకుడిగా నాకు నచ్చిన చిత్రాలను మన ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతోనే రీమేక్ చిత్రాలు రూపొందిస్తున్నాను.
- చిన్నతనం నుంచి నటుడు కావాలనే కోరిక ఉన్నప్పటికీ బ్యాగ్రౌండ్ లేకపోతే కష్టమని టెక్నీషియన్‌గా ఇండస్ట్రీకొచ్చాను. టి.కృష్ణ, బి.గోపాల్, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకుల దగ్గర పని చేశాను. నటనపై ఆసక్తితో ఆర్.నారాయణ మూర్తి రూపొందించిన ‘ఆలోచించండి’ చిత్రంలో సెకెండ్ హీరోగా నటించాను. కానీ అది ఆడకపోవడంతో గుర్తింపు రాలేదు. రెండు పడవల ప్రయాణం వద్దనుకుని దర్శకుడిగా కొనసాగాను. మిత్రులు అడిగారని కుదిరితే కప్పు కాఫీ, కెరటం లాంటి చిత్రాల్లో నటించాను. ఇక దర్శకుడిగా నేనెవరో ప్రేక్షకులకి తెలియాలనే నా చిత్రాల్లో అతిథి పాత్రలు చేస్తుంటాను. ఈ మూవీలో బ్యాంక్ మేనేజర్ రోల్ కూడా అలాంటిదే. సినిమా నచ్చినా నా పాత్ర నెగిటివ్ కావడంతో తిట్టుకున్నారు.
- ఆ మధ్య నేను, అల్లరి నరేష్ కలిసి ‘సుడిగాడు–2’ చేయాలనుకున్నాం. కానీ ఆ మార్క్‌ని అధిగమించడం కష్టం. పైగా జబర్దస్త్ లాంటి టీవీ కార్యక్రమాల వల్ల ప్రేక్షకులు ఇప్పుడిలాంటి చిత్రాలను యాక్సెప్ట్ చేస్తారో లేదోనని సందేహపడ్డాం. కానీ ఇటీవల వచ్చిన ‘కొబ్బరిమట్ట’ మెప్పించడంతో ‘సుడిగాడు’ సీక్వెల్‌పై నమ్మకం కుదిరింది. అన్నీ కుదిరితే త్వరలో చేయాలను కుంటున్నాం.