8 దశాబ్ధాల ప్రస్థానం.. 12 వేలకు పైగా పాటలు.. 2 నేషనల్ అవార్డులు.. లెజండరీ సింగర్ ఆశా భోస్లే బ్యాగ్రౌండ్ ఇదే

8 దశాబ్ధాల ప్రస్థానం.. 12 వేలకు పైగా పాటలు.. 2  నేషనల్ అవార్డులు.. లెజండరీ సింగర్ ఆశా భోస్లే బ్యాగ్రౌండ్ ఇదే

ముంబై: భారత సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) కన్నుమూశారు. శనివారం (ఏప్రిల్ 11) గుండె పోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచారు.

ఆశా భోస్లే మరణాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే ధృవీకరించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‎తో ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆశా భోస్లే మరణానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మరీ సంగీత రంగానికి అపారమైన కృషి చేసిన ఆశా భోస్లే బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..

ఆశా భోస్లే బ్యాగ్రౌండ్:

దాదాపు 8 దశాబ్ధాల పాటు సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే 1933, సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో మరాఠీ సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. ఆమెకు మొత్తం ఐదుగురు తోబుట్టువులు. ఇందులో భారత ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ ఒకరు. 

16 ఏళ్ల చిన్న వయసులోనే ఆశా భోస్లే గణపత్రావ్ భోస్లేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1960లో వీరు విడిపోయారు. ఆ తర్వాత 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ (పంచమ్)ను ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఆశా భోస్లేకు హేమంత్ భోస్లే, వర్షా భోస్లే, ఆనంద్ భోస్లే ముగ్గురు సంతానం. 

ఆమె తన 10వ ఏట 1943లో మాఝా బాల్ అనే మరాఠీ చిత్రంలో 'చలా చలా నవ బాలా' అనే పాటతో సంగీత పరిశ్రమలో ప్రస్థానం మొదలుపెట్టారు. 1948లో చునరియా సినిమాలోని సావన్ ఆయా సాంగ్‎తో బాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇచ్చారు. అత్యధిక స్టూడియో రికార్డింగ్‌లు (పాటలు) పాడిన గాయనిగా 2011లో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

తెలుగులో భోస్లే హిట్స్:

తెలుగులో మరుపురాని హిట్ సాంగ్స్ పాడారు భోస్లే. ఈ జనరేషన్‎కు 2007లో చందమామ సినిమాలో పాడిన నాలో ఊహలకు నాలో ఆశలకు నడకలు నేర్పావు.. అనే పాట ద్వారా ఆమె గుర్తుంటారు. హిందీతో పాటు తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఎన్నో డుయెట్స్ పాడారు. ముఖ్యంగా తెలుగులో ఇది మౌన గీతం (పాలు నీళ్లు 1981), శీతాకాలం ప్రేమకు (అశ్వమేధం 1992), ఓ ప్రేమ (అశ్వమేధం,1992), ఐసలకడీ (పవిత్ర బంధం 1996), వెన్నెల (ఇద్దరు 1997).. మొదలైన పాటలు ఆమెను తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిపి ఉంచుతాయి. 

చురా లియా హై తుమ్నే జో దిల్ కో..

ఆశా భోస్లేకు మల్టీటాలెంటెడ్ సింగర్‎గా పేరుంది. గజల్స్ నుంచి ఉర్రూతలూగించే క్యాబరే గీతాల వరకు ఎలాంటి పాటనైనా సునాయాసంగా పాడటం ఆమె స్పెషల్. హిందీలో ఓ.పి. నయ్యర్‌తో ఆమె ఆవో హుజూర్ తుమ్కో సాంగ్ ఎంత హిట్టో మన తాతలు, తండ్రులకు తెలుసు. ఆర్.డి. బర్మన్‌తో ఆమె పాడిన ఎవర్ గ్రీన్ హిట్.. చురా లియా హై తుమ్నే జో దిల్ కో.. ఈ జనరేషన్‎కు కూడా సుపరిచితం అని చెప్పుకోవచ్చు.

పియా తు అబ్ తో ఆజా, యే మేరా దిల్..  వంటి పాటలలో శృంగారాన్ని నింపగల ఆమె సామర్థ్యం హిందీ సినిమా సంగీత స్వరూపంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. యే మేరా దిల్.. అనే సాంగ్ రీమేక్ లో కూడా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్‌కు అతీతంగా, ఆమె ఇన్ ఆంఖోం కీ మస్తీ, దిల్ చీజ్ క్యా హై ఎమోషనల్ సాంగ్స్ ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ సంగీతం నుంచి క్యాబరే వరకు ఆమె పాడిందంటే.. అందులో తన మార్క్ ఉండాల్సిందే.

మోడ్రన్స్ హిట్స్..

బ్లాక్ అండ్ వైట్ తెర నుంచి ఇప్పటి వరకు ఆమె పాటకు జనం నీరాజనం పలికారనే చెప్పాలి. పాత పాటలే కాకుండా 90వ , 2000వ దశకం ప్రారంభంలో భోస్లే ఆధునిక, పాప్-ప్రభావిత సంగీతాన్ని స్వీకరించి, తన కెరీర్‌‎ను రీస్టార్ట్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్‌తో ఆమె చేసిన..  తన్హా తన్హా, రంగీలా రే..  వంటి ఐకానిక్ పాటలతో మంత్రముగ్ధులను చేశారు.  రాత్ అకేలీ హై రీమిక్స్, జరా సా జూమ్ లూ మై.. తన మార్క్ చూపించారు. జనత్-ఎ-జహాన్, కభీ తో నజర్ మిలావో వంటి ఇండిపాప్ హిట్‌లతో ఆమె తన లెజెండరీ హోదాను కొనసాగిస్తూ వచ్చారు.

అవార్డ్స్:

సంగీత రంగానికి ఆమె చేసిన అపారమైన కృషికి గాను భోస్లే భారత అత్యున్నత పౌర, సినీ పురస్కారాలు అందుకున్నారు. 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2008లో పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. అంతేకాకుండా, ఉమ్రావ్ జాన్,  ఇజాజత్.. చిత్రాలలో తన అద్భుతమైన నటనకు గాను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. 7 ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.