కీసర: ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. కారు టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఒక కాంక్రీట్ ట్యాంకర్ అదుపు తప్పి అమాంతం కారుపై పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఎంత మంది ఉన్నారో తెలియలేదు. ఏ ఒక్కరూ బయటపడలేని విధంగా కాంక్రీట్ ట్యాంకర్ కారుపై పడటం గమనార్హం. జేసీబీ సాయంతో ఆ కాంక్రీట్ ట్యాంకర్ను కారుపై నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును బీఎండబ్ల్యూ (TS09FT6662)గా పోలీసులు గుర్తించారు. హెవీ లోడ్తో వెళుతున్న ట్యాంకర్గా తెలిసింది.
టర్న్ తీసుకుంటున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే అదుపు తప్పి ట్యాంకర్ కారుపై పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెడీ మిక్స్ లోడ్తో ఉండటం వల్లే ట్యాంకర్ కారుపై పడగానే కారు దాదాపుగా నుజ్జునుజ్జయింది. బి.శ్రీనివాసరావు పేరుతో ఈ కారు రిజిస్ట్రర్ అయి ఉన్నట్లు నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించారు. కారును చూస్తుంటే కొత్త కారులానే ఉందని స్థానికులు తెలిపారు. కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో అసలు ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత లేదు.
