హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల చేరికపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. గిరిజన ప్రాంతాల్లో బోగస్ పత్రాలతో గిరిజనేతరులు సర్ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారని, వారి తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు మండలానికి చెందిన ఆదివాసి సేన అధ్యక్షుడు ఎం.దౌలత్‌రావు మరొకరు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు నివాస ధ్రువీకరణ పత్రాలను తారుమారు చేస్తూ ఓటర్ల జాబితాలో చేరుతున్నారన్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సమర్పిస్తున్న ఎన్యూమరేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హతలేని గిరిజనేతరులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
భవిష్యత్తులో గిరిజనేతరుల్ని ఓటర్ల జాబితాలో చేర్చేముందు సమగ్ర ధ్రువీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఎన్నికల అధికారులకు శిక్షణ ఇప్పించాలని కోరారు. షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలను విన్న బెంచ్ ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయడానికి రెండు వారాల గడువు ఇచ్చింది.
