చేవెళ్ల, వెలుగు: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. గురువారం రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
ప్రతీ గ్రాడ్యుయేట్‌ను స్వయంగా కలవాలని, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్లమెంట్ ఇన్‌చార్జిలు, ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
