- మసీదు కోసం మరోచోట భూమి ఇవ్వాలని సూచన
దశాబ్దాలుగా కొనసాగుతున్న ధార్ జిల్లాలోని భోజ్ శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు చెప్పింది. వివాదాస్పద భోజ్ శాల ప్రాంగణం వాగ్దేవి (సరస్వతీ దేవి)కి అంకితం చేసిన ఆలయమేనని కోర్టు స్పష్టం చేసింది.
ఇండోర్: దశాబ్దాలుగా కొనసాగుతున్న ధార్ జిల్లాలోని భోజ్ శాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద భోజ్ శాల ప్రాంగణం వాగ్దేవి (సరస్వతీ దేవి) కి అంకితం చేసిన ఆలయమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ ఆలోక్ అవస్థిలతో కూడిన ఇండోర్ బెంచ్ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ కట్టడం ప్రాథమికంగా హిందూ దేవాలయమని, అక్కడ గతంలో సంస్కృత బోధనా కేంద్రం (సరస్వతీ కంఠాభరణం) ఉండేదని కోర్టు నిర్ధారించింది.
2003 ఏప్రిల్ 7న పురావస్తు శాఖ (ఏఎస్ఐ) జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఆ ఉత్తర్వు ప్రకారం ప్రతి శుక్రవారం ముస్లింలు అక్కడ నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉండేది. తాజా తీర్పుతో ఆ అనుమతి రద్దయింది. ఈ ప్రాంగణం పరిపాలన, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ఏఎస్‌ఐ తుది నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. కమల్ మౌలా కమిటీ అభ్యర్థిస్తే మసీదు నిర్మాణం కోసం వేరే చోట భూమి కేటాయించే ప్రతిపాదనను పరిశీలించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
- జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు
భోజ్‌శాల వివాదంపై తీర్పు నేపథ్యంలో ధార్ జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా 1,200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ రంజన్ మీనా తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, ఈ తీర్పును సుప్రీంలో సవాలు చేస్తామని ముస్లిం పక్షానికి చెందిన ఖాజీ వకార్ సాదిక్ తెలిపారు. ఈ కేసులో హిందూ, ముస్లిం పక్షాలతో పాటు జైన్ సంఘం కూడా తమ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.
- కీలకంగా ఏఎస్‌ఐ సర్వే రిపోర్ట్
ఏఎస్‌ఐ 2024లో నిర్వహించిన 98 రోజుల శాస్త్రీయ సర్వే నివేదిక ఈ కేసులో కీలకంగా మారింది. సుమారు 2,000 పేజీల ఈ నివేదికలో.. ప్రస్తుత కట్టడం కింద ఒక భారీ ప్రాచీన నిర్మాణం ఉండేదని, పాత ఆలయ భాగాలను ఉపయోగించి మసీదును నిర్మించారని ఏఎస్‌ఐ పేర్కొంది. అక్కడ లభించిన నాణేలు, శిల్పాలు, శాసనాలు అది పరమార వంశపు రాజు భోజుడి కాలం నాటి ఆలయమని ధ్రువీకరించాయి.
