వివాదాస్పద స్థలం భోజ్శాల హిందూ దేవాలయమే.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

వివాదాస్పద స్థలం భోజ్శాల హిందూ దేవాలయమే.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన  తీర్పు

మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంతోకాలంగా వివాదస్పదస్థలంగా ఉన్న ధార్ పట్టణంలోని భోజ్శాలను  హిందూ దేవాలయం అని తీర్పు చెప్పింది. భోజ్శాలలో ఎన్ని దశాబ్దాలుగా పూజలు జరుగుతున్నాయని ఏఎస్ఐ సర్వే ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో ఉన్న భోజ్‌శాల  సరస్వతి దేవాలయమని హిందూసంఘాలు.. కాదు కమల్ మౌలా మసీదు అని ముస్లిం సంఘాల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. సుదీర్ఘకాలం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం (మే15)  భోజ్శాల సరస్వతి దేవాలయమే అని  తీర్పు చెప్పింది. 

మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ శుక్రవారం(మే15)  హిందూ పక్షం డిమాండ్లను అంగీకరించి, భోజ్‌శాలను ఆలయంగా ప్రకటించింది. పురాతన స్మారక చిహ్నాలు లేదా కట్టడాలు, పురావస్తు ,చారిత్రక ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు మాత్రమే కాకుండా, అన్ని రకాల మతపరమైన ప్రదేశాలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని తెలిపింది. యాత్రికులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం, కొన్ని ప్రదేశాలలో సరైన ఏర్పాట్లు చేయడం, శాంతిభద్రతలను కాపాడటం కూడా రాజ్యాంగ విధి అని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా పవిత్రతను కాపాడటం ,దైవ స్వరూపాన్ని పరిరక్షించడం కూడా అత్యవసరమని స్పష్టం చేసింది. 

వివాదాస్పద స్థలంలో బోజ్ శాలలో హిందూ దేవతారాధన సంప్రదాయం ఎన్నడూ ఆగిపోలేదని హైకోర్టు తెలిపింది. చారిత్రక సాహిత్యం,రికార్డుల ప్రకారం వివాదాస్పద ప్రాంతం పర్మర వంశానికి చెందిన భోజరాజుతో సంబంధం ఉన్న సంస్కృత విద్యా కేంద్రం  భోజశాల అని స్పష్టమవుతోందని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. 

ఏంటీ భోజ్శాల వివాదం.. 

ధార్ జిల్లాలో భారత పురావస్తు శాఖచే సంరక్షించబడుతున్న వివాదాస్పద పురాతన కట్టడం. భోజ్‌శాలను వాగ్దేవి (సరస్వతీ దేవి)ఆలయమని హిందూసంఘాలు, కాదు.. కమల్ మౌలా మసీదు ముస్లిం మత సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు జైన సమాజానికి చెందిన ఓ పిటిషనర్, వివాదాస్పద ఈ కట్టడం మధ్యయుగపు జైన దేవాలయం, గురుకులమని వాదిస్తున్నారు.

బోజ్ శాల కట్టడంపై వివాదం చెలరేగిన తర్వాత ఏప్రిల్ 7,2003న ప్రతి మంగళవారం హిందువులు పూజలు జరుపుకోవచ్చని, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ఏఎస్ ఐ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హిందూ సంఘాలు బోజ్ శాలలో పూజలు చేసుకునే ప్రత్యేక హక్కులు కోరుతూ హైకోర్టులో ఈ ఉత్తర్వును సవాలు చేశాయి. 

హైకోర్టు ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా ,జస్టిస్ అలోక్ అవస్థి ఈ ఏడాది ఏప్రిల్ 6న ఈ కేసుకు సంబంధించిన ఐదు పిటిషన్లు, ఒక రిట్ అప్పీల్‌పై విచారణ ప్రారంభించారు. విభిన్న మత విశ్వాసాలు, చారిత్రక వాదనలు, చట్టపరమైన నిబంధనలు, వివాదాస్పద స్మారక చిహ్నానికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్స్ పరిశీలించింది. మూడు పక్షాల వాదనలు విన్న తర్వాత, మే 12న బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసింది.

కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు..

  • భోజ్‌శాల ప్రాంగణంలో ముస్లింలు ప్రార్థనలకు గతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిన 2003 నాటి ఉత్తర్వును ధర్మాసనం రద్దు చేసింది.
  • వివాదాస్పద కట్టడం మతపరమైన హిందూ దేవాలయం. 
  • పురావస్తు ఆధారాలు ,చారిత్రక రికార్డులు, భోజశాలలో సంస్కృత విద్యా కేంద్రం,సరస్వతీ దేవి ఆలయాన్ని సూచించే చిహ్నాలున్నాయని గుర్తింపు.  
  • మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలంకోసం ముస్లిం సంఘాలు  రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. 
  • పురావస్తు ఆధారాలు, చారిత్రక ప్రస్తావనలు, సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య వివాద తీర్పు నుంచి న్యాయ సూత్రాల ఆధారంగా  భోజ్ శాల దేవాలయమే అని కోర్టు పేర్కొంది.
  • ఆలయ భవిష్యత్ పరిపాలన ,నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి భారత పురావస్తు శాఖకు సూచించింది.