- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘటన
భోపాల్: పదో తరగతి చదువుతున్న 16 ఏండ్ల విద్యార్థిపై ఇద్దరు మైనర్లు విచక్షణ రహితంగా దాడి చేశారు. 30 సెకండ్ల వ్యవధిలో 27సార్లు కత్తితో పొడిచారు. ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని నిందితులే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.
ఫిబ్రవరి 15న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. గణేశ్ చౌక్‌లో ఉన్న స్నూకర్ క్లబ్‌లో బాలుడు గేమ్ ఆడుతున్న సమయంలో ఇద్దరు మైనర్లు ఆకస్మాత్తుగా దూసుకొచ్చారు. బాధితుడిని ఒక మూలకు నెట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. అరనిమిషంలోనే 27 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేశామని తెలిపారు. బాధితుడు, నిందితులు ముగ్గురూ ఒకే కోచింగ్ సెంటర్‌లో చదువుతున్నారని చెప్పారు.
కొద్దిరోజుల క్రితం స్నూకర్ ఆడుతున్న సమయంలో వీరి మధ్య గొడవ జరిగిందని పేర్కొన్నారు. ఆ సమయంలో బాధితుడు నిందితులిద్దరినీ చెంపదెబ్బ కొట్టాడని, ఆ కక్షతోనే వారు ఈ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.
