- అడ్డుకున్న పోలీసులు.. రాంచందర్‌రావు సహా నేతల అరెస్టు
- గాంధీభవన్ ముందున్న ఫ్లెక్సీలను చింపేసిన బీజేపీ శ్రేణులు
- ప్రతిగా బీజేపీ ఆఫీసు ముట్టడికి కదిలిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ఇరు పార్టీల నేతల గొడవతో తీవ్ర ఉద్రిక్తత
- రాళ్లు, కర్రలతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల పరస్పర దాడులు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.బుధవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి గాంధీ భవన్ వైపు దూసుకెళ్తున్న ఆ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఈ క్రమంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా పలువురు నేతలను పార్టీ ఆఫీసు బయటే అదుపులోకి తీసుకొని.. గోషామహల్ స్టేషన్‌కు తరలించారు. మరోపక్క కాంగ్రెస్ నేతలు కూడా.. బీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు.
దీంతో నాంపల్లి ప్రాంతం పూర్తిగా కొద్దిసేపు రణరంగంగా మారింది. విచక్షణారహితంగా రాళ్లు విసురుకోవడంతో సాధారణ జనం భయంతో పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ నేతలు కొందరు గాంధీ భవన్ వద్దనున్న ఫ్లెక్సీలను చింపేశారు. గాంధీ భవన్‌పైనా రాళ్లతో దాడులు చేశారు. పలువురు మీడియా ప్రతినిధులు, పోలీసులకు గాయాలయ్యాయి. తోపులాటలో పలువురు మహిళా పోలీసులు గాయపడ్డారు.
రాహుల్ విదేశీ ఏజెంట్‌లా మారుతున్నారు: రాంచందర్ రావు
దేశ విచ్ఛిన్నకర శక్తులతో రాహుల్ గాంధీ చేతులు కలిపారని, ఆయన ఒక విదేశీ ఏజెంట్‌లా ప్రవర్తిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. నీట్ పరీక్షలపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెప్పినా.. సమాధానం లేక రాహుల్ వీధి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ తరహాలో ఇక్కడ యువతను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంటే, తట్టుకోలేక రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ ప్రేరణతో విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో రైతు ఉద్యమం ముసుగులో.. షాహిన్‌బాగ్ ఆందోళనను ఏ విధంగానైతే దేశవ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయో, నేడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అదే తరహాలో ధర్నా సాగుతోందని అన్నారు.
ఢిల్లీలో నిరసనకు దిగిన వారిలో అసలు నీట్ విద్యార్థులే లేరని, కేవలం యాంటీ సోషల్, అల్ట్రా లెఫ్ట్ మూకలను జమ చేసి ఆందోళనలు చేయిస్తున్నారన్నారు. ఆ నిరసనల్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణతోపాటు చైనా, పాకిస్తాన్‌కు మద్దతుగా దేశ వ్యతిరేక నినాదాలు చేయడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు.
ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల విదేశీ మాయలో పడి రాహుల్ గాంధీ విదేశీ ఏజెంట్‌లా మారి బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్ర లకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముష్కర మూకల దాడి ప్రజాస్వామ్యానికే చీకటి రోజు అని అన్నారు.
ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ వేదికగా చర్చించాల్సిన విషయాలను రోడ్ల మీదకు తెచ్చి దేశాన్ని అస్థిరపరచాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా, బీజేపీ నేతల అరెస్టులను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.
అధికారంలో ఉండి ధర్నాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్ తీరు చూసి జనం నవ్వుకుంటున్నారని వారు పేర్కొన్నారు. దమ్ముంటే పార్లమెంట్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అరెస్టులను ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, గొడెం నగేశ్ ఖండించారు.
