- తార్నాక నుంచి జూబ్లీహిల్స్ దాకా మెట్రోలో ప్రయాణం
హైదరాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంధనాన్ని పొదుపు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి, ప్రజా రవాణాను ఎంచుకోవడం ద్వారా దేశ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన బాధ్యతాయుత జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు ఆయన శుక్రవారం తార్నాక నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రో ట్రెయిన్లో ప్రయాణించారు.
ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో మాట్లాడారు. ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరించారు. విదేశీ ఇంధనంపై మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, అందుకే సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని సూచించారు. ప్రధాని మోదీ విజన్ ప్రకారం వోకల్ ఫర్ లోకల్ నినాదంతో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అనవసర ఆడంబరాలకు పోకుండా పొదుపు పాటించాలని కోరారు. ప్రధాని మోదీ సూచించిన 10 సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఇలాంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. దేశ ఆర్థిక స్వావలంబనలో సామాన్యుల భాగస్వామ్యం అత్యంత కీలకమని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
