స్థానిక బీజేపీ నేతలు ITIR ప్రాజెక్టు పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. ITIR ప్రాజెక్టు తీసుకు తెలంగాణకు రావాలనే ప్రయత్నం రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచే తమ ప్రభుత్వానికి ఉందని, దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014 జూన్ నెలలోనే సీఎం కేసీఆర్… ప్రధాని మోడీకి ప్రత్యేకంగా ఒక లేఖ కూడా రాశారని తెలిపారు. ఆ తర్వాత కూడా దాదాపు 10 సార్లు కేంద్ర ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో లేఖలు రాయండంతో పాటు ప్రత్యక్షంగా కలిసి ITIR ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
లేటెస్టుగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ మినిస్టర్ ఫర్ స్టేట్ సంజయ్ దోత్రే ఇచ్చిన సమాధానంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ITIR కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంలో తెలపడం… లోక్ సభను తప్పుదోవ పట్టించడమేనన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడిగినా పూర్తి సమాచారంతో పాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ( DPR) లను కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినదని చెప్పారు. ఆ తర్వాత ITIR కు సంబంధించి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్లిన విషయాన్ని కేంద్ర మంత్రి దాచిపెట్టారన్నారు.
స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు మంత్రి కేటీఆర్. 2014 జూన్ నెల నుంచి 2021 జనవరి వరకు అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ITIR పైన సత్వర నిర్ణయం తీసుకొని హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మరింత చేయూత అందించాలని పదేపదే విజ్ఞప్తి చేశామన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రెండు సార్లు ఐటిఐఆర్ కు సంబంధించిన డీపీఆర్ లను సమర్పించింది అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిలన్నింటినీ బుట్టదాఖలు చేసిన కేంద్రం పూర్తిగా ITIR ని రద్దు చేసిందన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానంలోనూ ITIR ను రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉన్న విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు గుర్తించాలన్నారు. కేవలం అసత్యాలు, దుష్ప్రచారంతో ప్రజలను ఎల్లకాలం మభ్య పెట్టాలనే, బీజేపీ వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్.

