తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేస్తున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపింది. ఏప్రిల్ 21 అర్ధరాత్రి.. అంటే మొదటి డ్యూటీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. ఈ జేఏసీ వెనుక 40 వేల మంది కార్మికుల బలం ఉందని చెప్పారు జేఏసీ నేతలు. కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని... విభజించు పాలించు అనే ధోరణి ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు.
కమిటీ వేశామంటూ కాలయాపన చేయొద్దని..మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు జేఏసీ నేతలు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నామని చెప్పారు. కొత్త కోర్కెలేవీ కోరడం లేదని.. ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బంది పెట్టే బదిలీలు ఆపి, ఎక్కడి వారిని అక్కడే ఉంచాలన్నారు.

