కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమ్మక్కు.. ఇద్దరూ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నరు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌

కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమ్మక్కు.. ఇద్దరూ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నరు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌
  • మీకు చేతనైతే సలహాలివ్వండి.. కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దు
  • అబద్ధాలు, అహంకారంతో డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా..
  • కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడ్తున్నరు
  • గుజరాత్‌‌‌‌‌‌‌‌కు గులాములుగా పని చేస్తున్నరు.. వారికి హైదరాబాద్​ అభివృద్ధి పట్టదా?
  • మోదీని అడిగి మెట్రోకు నిధులు తెచ్చే తెలివిలేదా?  
  • ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అసెంబ్లీలో చర్చకు మేం రెడీ
  • వారు రాకుంటే బయటకు ఎలా రప్పించాలో మా కార్యకర్తలకు తెలుసు
  • భవిష్యత్తులో శేరి​లింగంపల్లి, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో 
  • నియోజకవర్గాల సంఖ్య 10కి పెరుగుతుంది
  • కష్టపడి పనిచేసేటోళ్లకు ఇంటికే బీఫామ్‌‌‌‌‌‌‌‌ పంపిస్తానని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలతో గూడుపుఠాని చేస్తున్నాయని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, అంతే తప్ప అబద్ధాలు, అహంకారంతో అభివృద్ధిని అడ్డుకోవద్దని కేసీఆర్, కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. వారి మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను, రాజకీయ వ్యూహాలను తెలంగాణ సమాజం, ముఖ్యంగా ఇక్కడి యువత నిశితంగా గమనిస్తోందని హెచ్చరించారు. 

రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే వారు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ‘‘ధైర్యముంటే అసెంబ్లీకి రండి.. గత పదేండ్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఏం చేసిందో, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏం చేసిందో, ఈ కొద్ది కాలంలో తాము ఏం చేశామో పద్దులతో సహా చర్చ పెడతాం” అని అన్నారు. ఈ చర్చలో తమ పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీతోనే సమాధానం ఇప్పిస్తానని చెప్పారు. సభకు రాకుండా తప్పించుకోవాలని చూస్తే.. ‘ఎలుకకు పొగ పెట్టి బయటకు ఎట్లా తేవాలో మా కార్యకర్తలకు బాగా తెలుసు’ అని అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ, విద్యాశాఖ, ఆర్‌ అండ్‌ బీ విభాగాల ఆధ్వర్యంలో మొత్తం రూ.1,674 కోట్ల వ్యయంతో చేపట్టే పలు మెగా ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి పునాది రాయి వేయడంతో పాటు కొన్నింటిని ప్రజలకు అంకితం చేశారు. ఇందులో ప్రధానంగా సీఎంసీ పరిధిలో మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి అల్విన్ ఎక్స్ రోడ్స్ వరకు నిర్మించనున్న 6 లేన్ల బై-డైరెక్షనల్ ఫ్లైఓవర్, హఫీజ్‌పేట, బాచుపల్లి అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు (రూ.530 కోట్లు), శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆర్వోబీ (రూ.308 కోట్లు), సీఎంసీ శాశ్వత కార్యాలయ భవన నిర్మాణం (రూ.161 కోట్లు), ఇతర పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చిన్న వార్డు మెంబర్ ఎన్నికలొచ్చినా మోదీని చూసి ఓటెయ్యాలని బీజేపీ నేతలు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే, ఆ తర్వాత కాపురం చేయాల్సింది పెళ్లి పెద్ద కాదని, భర్తేనని తెలిపారు. స్థానిక డ్రైనేజీల్లో, మోరీల్లో మురికి తీయడానికి ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ రాడని, స్థానికంగా అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులే కావాలని అన్నారు.  

కాంగ్రెస్‌కు పేరొస్తుందని అడ్డంకులు..

తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తే, తన వెనుకే బీజేపీ నేతలు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానిని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, రైల్వే మంత్రిని  తాను కలిసి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధుల కోసం విజ్ఞప్తి చేసి వచ్చిన మూడు రోజులకే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి వాళ్లను కలుస్తున్నారని చెప్పారు.

 అనుమతులు, నిధులు ఇస్తే కాంగ్రెస్​ ప్రభుత్వానికే పేరు వస్తుందని, ఇవ్వవద్దని చెప్తున్నారని ఆరోపించారు. పాలు కాస్తే అందులో ఉప్పు వేసినట్టుగా రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడే ధోరణిని వీడాలని హితవు పలికారు. 

మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాణహిత–-చేవెళ్ల (తుమ్మిడిహెట్టి) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుపడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, గుజరాత్ అభివృద్ధికి కట్టుబడే వారు తెలంగాణ శ్రేయస్సును కూడా కాపాడాలని డిమాండ్ చేశారు. 

పదేండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన పెద్ద మనిషి (కేసీఆర్‌‌)  చివరకు ఓడిపోయి ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. పదేండ్లలో రాష్ట్రంలో వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే ఏమీ చేయలేదంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

కేంద్రంలో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి పదేండ్లు దాటినా సాధించిందేమీ లేదని, కానీ ఆ పార్టీ నాయకులు తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. 

ఆ నలుగురికీ నిధులు తెచ్చే తెలివి లేదా ?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయో జనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని సీఎం  విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే.. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఢిల్లీ వెళ్లారని, వారి అండతోనే మోదీ మళ్లీ దేశానికి ప్రధాని అయ్యారన్నారు. ఈ 8 మందిలో నలుగురిని (సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి) ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే గెలిపించారని, కిషన్ రెడ్డి ఏకంగా కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తున్నారన్నారు. 

ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఢిల్లీ నుంచి మెట్రో రైలు విస్తరణకు నిధులు తెచ్చే తెలివితేటలు వీళ్లకు లేవా? అని  ప్రశ్నించారు. హైదరాబాద్‌ను, తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావుకు లేదా?అని  నిలదీశారు. విస్తరిస్తున్న నగర జనాభా దాహార్తీ తీర్చడానికి గోదావరి నది నుంచి మరో 20 టీఎంసీల తాగునీరు తెచ్చే పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారని  ఆరోపించారు. సిం గూరు నదీ జలాలు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని, మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరపకుండా ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టును కూడా ఈ బీజేపీ నేతలే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  

 కష్టపడి పనిచేసే నేతలకు ఇంటికే బీ-ఫామ్స్ 

నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న స్థానిక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి   స్పష్టమైన హామీ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ కార్పొరేటర్లుగా సేవలు అందిస్తున్న జగదీశ్​ గౌడ్ దంపతులు, కార్పొరేషన్ చైర్‌పర్సన్లు బండి రమేశ్​, రఘునాథ్ యాదవ్, జర్రపేట జయపాల్, వజ్రేశ్‌ యాదవ్, చల్లా నరసింహారెడ్డిలాంటి నాయకుల కృషిని ప్రశంసించారు. 

భవిష్యత్తులో శేర్‌‌లింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో స్థానిక నియోజకవర్గాల సంఖ్య కనీసం పదికి పెరుగుతుందని చెప్పారు. నాయకులెవరూ టికెట్ల విషయంలో ఆందోళన చెందకుండా ‘బస్తీ బాట’ పట్టి పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నిలకడగా పనిచేసే వారికి తానే స్వయంగా బీ-ఫామ్‌ను ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

నగరంలో గతంలో ఉన్న గందరగోళ పరిపాలనకు స్వస్తి పలుకుతూ.. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించినట్టు సీఎం వెల్లడించారు. 150 డివిజన్లతో జీహెచ్ఎంసీ, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు పోలీస్, మున్సిపల్, హెచ్ఎండీఏ, మెట్రో వాటర్ వర్క్స్ విభాగాల మధ్య సఖ్యత ఉండేది కాదని.. ఇప్పుడు పోలీస్ కమిషనరేట్, మున్సిపల్ సరిహద్దులను ఒకేలా నిర్ధారించి పరిపాలనను సులభతరం చేశామని చెప్పారు. 

మైక్రోసాఫ్ట్, గూగుల్ కార్పొరేట్ ఆఫీసుల తరహాలోనే సీఎంసీ కార్యాలయాన్ని పూర్తి ‘నెట్ జీరో’ విధానంలో అద్భుతంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాగా, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు గాజుల రామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్‌ను నిర్మించబోతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.  రాయదుర్గం వద్ద ఆగిపోయిన మెట్రో రైలును నియోపోలిస్ వరకు విస్తరిస్తామన్నారు.   

హైదరాబాద్​ అభివృద్ధికి నిపుణుల కమిటీ 

ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిందని, స్కూళ్లు, ఆఫీసులు, పార్లమెంటుతో పాటు చివరకు పీఎంవో కూడా మూతపడేలా కాలుష్యం ఆ నగరాన్ని వణికిస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు వస్తే రోడ్లపై 10 అడుగుల మేర నీరు నిలిచిపోతోంది. ఐటీ అభివృద్ధికి పేరొందిన బెంగళూరులో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది.  ఇక చెన్నై నగరంలో భారీ వర్షాలు వస్తే అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ వారాల తరబడి వరద నీటిలో మునిగిపోయి పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది.

 కోల్‌కతాలో శాంతిభద్రతల సమస్యల కారణంగా ఇండ్ల నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి వస్తారో లేదో తెలియని ఆందోళన నెలకొంది. ఈ 5 నగరాల సమస్యలను, అక్కడి తీవ్రతను గమనించి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ను అలాంటి ఇబ్బందులు లేని సురక్షితమైన విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి నిపుణుల కమిటీతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నం’ అని సీఎం వివరించారు. 

ఢిల్లీలో యమునా నది, యూపీలో గంగా నది, గుజరాత్‌‌‌‌‌‌‌‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లను కట్టుకుంటే అబ్బా.. ఆహా.. ఓహో అంటూ ఇక్కడున్న కిషన్ రెడ్డి డప్పు కొడుతున్నారు. మరి మనకున్న మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకుంటే, మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు గుజరాత్‌‌‌‌‌‌‌‌కు గులాములుగా పని చేస్తున్నారా? గుజరాత్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేసుకోవడం మోదీ బాధ్యత అయితే.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను, తెలంగాణను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావుకు లేదా?

- సీఎం రేవంత్​రెడ్డి-