రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు వచ్చే ప్రమాదం

రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు వచ్చే ప్రమాదం
  • దేశ రాజకీయాలను మలుపుతిప్పుతానంటూ కేసీఆర్​ ప్రగల్బాలు
  • బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి

ఆదిలాబాద్​ : సొంత రాష్ట్రంలోనే సీఎంను నమ్మలేని పరిస్థితి ఉన్నా.. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతానంటూ కేసీఆర్​ బయల్దేరారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. అవినీతిలో రాష్ట్రం నంబర్​ వన్​గా ఉందని, అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితులు వచ్చే ప్రమాదముందన్నారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లాలో పర్యటించారు. ఎంపీ సోయం బాపురావు ఇంట్లో నిర్వహించిన కోర్​ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ జిల్లా ఆఫీసులో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలోనూ పాల్గొని మాట్లాడారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా బూత్​ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హుజూరాబాద్​ ఎన్నికల తర్వాత బీజేపీ ఓ శక్తిగా ఎదిగిందన్నారు. సీఎంను గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పటికే కేసీఆర్​ గ్రాఫ్​ పడిపోతుండటంతో టీఆర్​ఎస్​లో భయం మొదలైందని చెప్పారు. గతంలో పీకే అవసరం లేదన్న కేసీఆర్​.. ఇప్పుడు ఆయన సాయం తీసుకోవడమే నిదర్శనమన్నారు. ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణాలో పీకే స్కీములేవీ పనిచేయవని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు డబ్బు, మద్యం, బిర్యానీ, కుల సంఘాలకు భవనాలు వంటి వాటిని ఎరవేసి కేసీఆర్​ ఓట్లు అడుగుతారని, పీకే నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటాయని ఆయన విమర్శించారు. 


పదాధికారులదే బాధ్యత: బాపురావు
పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పదాధికారులదేనని ఎంపీ సోయం బాపురావు అన్నారు. క్రమశిక్షణలేని నాయకులను సస్పెండ్​ చేయడానికి అధిష్ఠానం ఎప్పుడూ వెనకాడదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించాలన్నారు. టీఆర్​ఎస్​ కన్నా బీజేపీ కార్యకర్తల బలం ఎక్కువని, విజయం కోసం చివరిదాకా పోరాడే సత్తా ఉందన్నారు.

 

సీఎం తప్పుడు నిర్ణయాలతో రైతులకు నష్టం
వరి వేయొద్దని, వేసినా కొనబోమన్న సీఎం కేసీఆర్​ తప్పుడు నిర్ణయాలతో రైతులు నష్టపోయారని వివేక్​ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకంలోనూ కేంద్రం వాటా ఉందని, ఆ విషయం ప్రజలకు తెలియకుండా ఆ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసల్​బీమా, ఆయుష్మాన్​ భారత్​ వంటి అద్భుతమైన పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర పథకాలు, రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులున్న దుబ్బాకలో గెలిచామని, జీహెచ్​ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్​ ఎన్నికల్లో కేసీఆర్​ అవినీతి సొమ్ము రూ.100 కోట్లను కుమ్మరించినా గెలువలేకపోయారని వివేక్​ గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. సమావేశం తర్వాత బీజేపీ ప్రచార రథాన్ని వివేక్​ ప్రారంభించారు. అంతకుముందు వివేక్​ వెంకటస్వామిని పార్టీ నాయకులు, దళిత మోర్చా నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సమావేశాల్లో పార్టీ జిల్లా ఇన్​చార్జి ఆల్చాపూర్​ శ్రీనివాస్​, బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​ పాయల్​ శంకర్​, మాజీ ఎంపీ రాథోడ్​ రమేశ్​, నాయకులు సుహాసిని రెడ్డి, మల్లికార్జున్​, వేణు గోపాల్​, ఆధీనాథ్​, జీవీ రమణ, లాలా మున్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.