V6 News

హిందుత్వ ఎజెండాతోనే కొత్త చట్టాలు

హిందుత్వ ఎజెండాతోనే  కొత్త చట్టాలు

ఓయూ, వెలుగు:

బీజేపీ దేశం మొత్తాన్ని హిందుత్వ రాష్ట్రాలుగా మార్చాలని చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అందుకే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్​తీసుకొస్తోందని విమర్శించారు. ఓయూ విద్యార్థి సంఘాల  ఆధ్వర్యంలో శుక్రవారం ‘‘సేవ్ ఇండియా –- సేవ్ కానిస్టిట్యూషన్​” నినాదంతో ‘‘టాక్ విత్ సీతారాం ఏచూరి’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ… దేశాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతుంటే బీజేపీ అవన్నీ వదిలేసి ఎన్ఆర్సీ, సీఏఏలను ముందుకు తేవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సీఏఏతో దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా పౌరసత్వం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ఈ చట్టం అమలు చేస్తే ముస్లిం మైనారిటీల పౌరసత్వాలే ఎక్కువగా రద్దవుతాయని పేర్కొన్నారు. దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఆర్ఎస్ఎస్​ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం ఎన్పీఆర్​ను ముందుకు తెచ్చిందన్నారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే ప్రజలు  తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని, దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న వారు ఈ దేశ పౌరులుగా నిరూపించుకోవాల్సి రావడం దౌర్భాగ్యమన్నారు. సీఏఏ కేవలం ముస్లింలకే కాదు పేద ప్రజలందరికీ వ్యతరేకమని, అందుకే ఇది ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎన్పీఆర్​ను అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 69 పిటిషన్లు ఫైల్​అయ్యాయని, కానీ జనవరి 22 వరకు వాటిపై స్పందిచమని న్యాయస్థానం చెప్పడం బాధాకరమన్నారు. డాక్టర్​నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, ఓయూ విభాగ అధ్యక్ష,కార్యదర్శులు గణేష్, రవి నాయక్, నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ చైర్మన్ దయాకర్, ఏఐఎస్ఎఫ్ స్టాలిన్, పీడీఎస్​యూ రంజిత్, శ్యామ్, శేఖర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్టికల్ 370 రద్దు అక్రమం

ఆర్టికల్​370 రద్దు అక్రమమని సీతారాం ఏచూరి అన్నారు. ఎన్టీఆర్ ​స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్​ఫెయిర్​ను ఆయన శుక్రవారం సందర్శించారు. నెల్లూరు నరసింహారావు సంపాదకత్వంలో తీసుకొచ్చిన ‘డిస్కెల్టింగ్​ జమ్మూ అండ్​ కాశ్మీర్​’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీనియర్​ జర్నలిస్టు వినయ్​కుమార్, కార్యదర్శి కోయ చంద్రమోహన్​ పాల్గొన్నారు.

BJP seeks to transform entire country into Hindutva states: CPM National Secretary General Sitaram Yechury