V6 News

అక్రమ సిగరెట్ల వ్యాపారానికి అడ్డాగా పాకిస్థాన్.. ప్రపంచంలోనే నంబర్ వన్

అక్రమ సిగరెట్ల వ్యాపారానికి అడ్డాగా పాకిస్థాన్.. ప్రపంచంలోనే నంబర్ వన్

ప్రపంచంలోనే అక్రమ సిగరెట్ల వ్యాపారానికి పాకిస్థాన్ అతిపెద్ద అడ్డాగా మారిందనే సంచలన నిజాన్ని బ్రిటిష్ అమెరికన్ టొబాకో గ్రూప్ ప్రతినిధి సైమన్ ట్రస్లర్ బయటపెట్టారు. పాకిస్థాన్ మార్కెట్లో దొరికే సిగరెట్లలో 55 శాతం అంటే సగానికి పైగా అక్రమ మార్గంలో వస్తున్నవేనని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి రావలసిన పన్నులు భారీగా ఎగవేతకు గురవుతుండటంతో, దేశీయ పన్నుల వ్యవస్థకు ఇది పెద్ద సవాలుగా మారింది. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతోందని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి.

పాకిస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సిగరెట్ పన్ను విధానం ఘోరంగా విఫలమైందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ తాజా రిపోర్ట్ పేర్కొంది. పన్నులు పెంచడం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని లేదంటే సిగరెట్ల వాడకం తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. వాస్తవానికి 2012 నుండి పాకిస్థాన్‌లో ఏటా వినియోగం దాదాపు 8వేల కోట్ల సిగరెట్లు వద్దే స్థిరంగా ఉంది. పన్నుల పెరుగుదల వల్ల లీగల్ బ్రాండ్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో.. వినియోగదారులు తక్కువ ధరకు దొరికే ఇల్లీగల్ బ్రాండ్ల వైపు మళ్లారు. ఫలితంగా వినియోగం తగ్గకపోగా, ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.

పన్ను చెల్లించే చట్టబద్ధమైన బ్రాండ్ల ధరలు పెరగడం వల్ల సామాన్యులకు అవి భారంగా మారాయి. సిగరెట్ల ధరల పెరుగుదలలో 80 శాతానికి పైగా కేవలం పన్నుల వల్లే జరుగుతోందని ట్రస్లర్ వివరించారు. దీనివల్ల లీగల్.. ఇల్లీగల్ సిగరెట్ల మధ్య ధరల వ్యత్యాసం భారీగా పెరిగింది. రాబోయే 2026-27 బడ్జెట్‌లో ఫెడరల్ ఎక్సైజ్ డ్యూటీని మరింతగా పెంచవద్దని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పన్నుల షాక్ తట్టుకోలేక వినియోగదారులు చౌకగా దొరికే అక్రమ సిగరెట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని వారు హెచ్చరిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం 2024లో పాకిస్థాన్‌లో పన్నుకు ముందు సిగరెట్ల ధర ప్రపంచ సగటులో 20 శాతం కంటే తక్కువగా ఉంది. ఇది స్థానిక తయారీదారులు పన్నులు ఎగ్గొట్టి అక్రమంగా సిగరెట్లను విక్రయించడానికి పెద్ద ప్రేరణగా మారుతోంది. తక్కువ తయారీ ఖర్చు కారణంగా అక్రమంగా విక్రయిస్తే వారికి లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. మొత్తానికి పాకిస్థాన్ పన్ను విధానం సిగరెట్ల వినియోగాన్ని అరికట్టడంలో విఫలమవ్వడమే కాకుండా.. బ్లాక్ మార్కెట్‌ను పెంచి పోషిస్తోందని లెక్కలు చెబుతున్నాయి.