విజయనగరం: బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, సౌతాఫ్రికా వామప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం మొదలవ్వాల్సిన మూడు రోజుల ప్రాక్టీస్ పోరులో తొలి రోజు ఆట భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడలేదు. మైదానం చిత్తడిగా ఉండడంతో లంచ్ విరామం అనంతరం ఆటను రద్దు చేశారు. టెస్ట్ సిరీస్‌కు ముందు ఈ ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని రెండు జట్ల ఆటగాళ్లు భావిస్తున్నారు. ముఖ్యంగా టెస్ట్ టీమ్‌లో ఓపెనర్‌గా కొత్త పాత్రలో ఒదిగిపోవాలని ఆశిస్తున్న బోర్డ్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, గాయపడ్డ జస్‌ప్రీత్ బుమ్రా ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన ఉమేశ్ యాదవ్‌పై అందరి దృష్టి ఉంది. అలాగే, సఫారీలపై సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని పలువురు యువ క్రికెటర్లు భావించారు. కానీ, ఫస్ట్ డే వారికి నిరాశే కలిగింది. తర్వాతి రెండు రోజులు కూడా విజయనగరంలో వర్షం పడే చాన్స్ ఉండడం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

