- రూల్స్ ఎందుకు మార్చారో బీఎఫ్‌ఐని అడుగుతా
- ఒలింపిక్ ట్రయల్స్ జరుగుతాయన్న నమ్మకముంది
- తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్
న్యూఢిల్లీ : లెజెండరీ బాక్సర్ మేరీకోమ్‌తో ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్స్ బౌట్ విషయంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) తన విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశిస్తోంది. ట్రయల్స్ నిర్వహించకపోతే మనిషిగా బాధపడడం తప్ప తానేం చేయలేనని నిఖత్ ఆవేదన వ్యక్తం చేసింది.
‘ట్రయల్స్‌కు నాకు అర్హత ఉంది. అందుకే బౌట్ పెట్టాలని అడుగుతున్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల నెరవేర్చుకోవడానికి ప్రతీ బాక్సర్ కష్టపడతాడు. అందరూ రూల్స్ పాటిస్తారు. కానీ ఒకరి కోసం వాటిని మార్చేసి అవకాశం దూరం చేస్తే ఇన్నాళ్లు పడిన శ్రమ ఏం కావాలి. ట్రయల్స్ విషయంలో ఫెడరేషన్ పెద్దల ప్రకటనలతో బాధ పడ్డాను కాబట్టే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లా. అంతకుముందే బీఎఫ్‌ఐకు చాలా మెయిల్స్ చేశా. దేనికి బదులు రాలేదు. జనవరి నుంచి జరిగిన ప్రతీ టోర్నీలో బరిలో దిగా, దేశానికి పతకాలు అందించా. ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో వరల్డ్ చాంపియన్‌ను ఓడించా, స్ట్రాన్జాలో గోల్డ్ గెలిచా. బాగా పెర్ఫామ్ చేస్తున్నా సరే. ట్రయల్స్‌కు ఎందుకు దూరంగా పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఇండియా ఓపెన్‌లో మేరీ చేతిలో ఓడిపోయినంత మాత్రాన ఇంకోసారి ఆమెతో పోటీకి పనికిరాకుండా పోతానా? ఆమే కాదు నేను కూడా గెలవాలనే రింగ్‌లోకి అడుగుపెడతా. మేరీని ఆదర్శంగా తీసుకునే ఇక్కడి దాకా వచ్చా. నాకు ఆమె లానే గొప్ప బాక్సర్ కావాలని ఉంది. ట్రయల్స్ పెడితే విజయం కోసం ఆడతా. మేరీతో బౌట్‌లో రిజల్ట్ ఏమైనా ఫర్వాలేదు. కానీ ముందు ఫైట్ జరగాలి. ట్రయల్స్ జరిగితే అందులో గెలవడంపైనే నా ఆలోచనంతా. ఒక వేళ ట్రయల్స్ జరగకపోతే నా కర్మ అనుకుంటా. 23 ఏళ్ల వయసులో నేను అంతకంటే ఇంకేం చేయగలను. బాక్సింగ్‌ను మాత్రం వదలను. కానీ రూల్స్ ఎందుకు మార్చారో బీఎఫ్‌ఐని అడుగుతా. ఎందుకంటే నేనూ మనిషినే.. నాకు బాధ ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది.


