దేశంలోని ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలకు లేని ప్రత్యేకత ఇక్కడి భ్రమరాంబ సమేత వైద్యనాద లింగేశ్వర మహా శైవక్షేత్రానికి ఉంది. ఈ క్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలో కొండాయిగూడెం, రామానుజవరం గ్రామాల సరిహద్దులో గోదావరి నది ఒడ్డున ఉంది. మరెక్కడా లేని విధంగా ఈ మహా శైవక్షేత్రంలో నవగ్రహాలు సతీసమేతంగా ప్రతిష్టించారు. 35 అడుగుల అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తాడు. ఆలయం చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించారు. 108 మారేడు మొక్కలను కూడా నాటారు.
మణుగూరు, వెలుగు: భ్రమరాంబ సమేత వైద్యనాథ శివలింగ మహా శైవక్షేత్రం ప్రతిష్ఠాపన 2009లో జరిగింది. ఇది తూర్పు అభిముఖంగా ఉంటుంది. అంతేకాకుండా ఆలయానికి ఉత్తరం వైపున గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ ఆలయం పక్కనే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. మరిన్ని ఆలయాలు కూడా కడుతూ ఉన్నారు. మహాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. జాతరకు మణుగూరు, పినపాక మండలాల ప్రజలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంగపేట, రాజుపేట, ఏటూరునాగారం ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏటా మహాశివరాత్రి రోజున సుమారు 35వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. ప్రతి సోమవారం క్షేత్రంలో అన్నదానం చేస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్టి రోజున వల్లీదేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం జరుపుతారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, శివ, పార్వతుల కల్యాణం చేస్తారు. గోదావరి నది పక్కన ఈ మహాశైవక్షేత్రం ఉండడంతో ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్‌ను కట్టించింది. గోదావరి నదికి చాలా దగ్గరగా ఉండడంతో వయసు పైబడిన వాళ్లు కూడా ఈజీగా ఇక్కడ నదీ స్నానాలు చేయొచ్చు.
సతీ సమేతంగా..
ఏ ఆలయంలోనైనా నవ గ్రహాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. అందుకోసం ప్రత్యేకంగా ఆలయం కట్టరు. ఆలయం ముందు ఒకే రూఫ్ కింద వాటిని ప్రతిష్ఠిస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఒక్కో గ్రహం కోసం ఒక్కో ఆలయం కట్టారు. అంతేకాకుండా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు.
ఎలా వెళ్లాలి
మణుగూరు పట్టణం హైదారాబాద్‌కు 330కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖమ్మం పట్టణానికి 150కిలోమీటర్లు, వరంగల్‌కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి 70కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి మణుగూరుకు బస్సు సౌకర్యం ఉంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఖమ్మం నుండి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. వరంగల్ నుంచి ఏటూరు నాగారం మీదుగా బస్సులు ఉంటాయి.
మహా అద్భుతం
ఇది అద్భుతమైన మహిమగల క్షేత్రం. గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామి దర్శనంతో పరవశించారు. ప్రతి సంవత్సరం మహశివరాత్రి రోజున వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు.
– భాను ప్రకాష్ శర్మ, ఆలయ పూజారి
