- బ్రాండెడ్ కంపెనీల కవర్లలో ప్యాక్ చేసి అమ్మకాలు
కోదాడ కేంద్రంగా నకిలీ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ల దందా జోరుగా సాగుతున్నది. లక్షల విలువైన నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి సరకు తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీల కవర్లలో ప్యాక్‌చేసి సరఫరా చేస్తున్నట్టు తేలింది.
సూర్యాపేట, వెలుగు: కోదాడ కేంద్రంగా నకిలీ కాఫీ పాకెట్లు, సిగరెట్ల దందా జోరుగా సాగుతోంది. సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇతర సరుకులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కోదాడ టౌన్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ హైదరాబాద్‌నుంచి నకిలీ కాఫీ ప్యాకెట్లు, సిగరెట్లు, ఇతర కల్తీ సరుకులు తీసుకొచ్చి బ్రాండెడ్కంపెనీల కవర్లలో ప్యాక్‌చేసి ఇక్కడి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
ముగ్గురు సభ్యుల ముఠా చేస్తున్న నకిలీ దందాకు సంబంధించి సమాచారం అందడంతో పట్టణంలోని వెంకటేశ్వర నగర్ లోని ఒక ఇంటిపై దాడి చేసినట్టు చెప్పారు. అక్కడ పెద్దమొత్తంలో నిల్వ చేసిన నకిలీ కాఫీ పొడి, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పావులూరి నారాయణమూర్తి, అనుప్ అగర్వాల్, ఏడిద సతీశ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

