హైదరాబాద్ లో బైక్ దొంగలుగా మారిన అన్నదమ్ములు

హైదరాబాద్ లో బైక్ దొంగలుగా మారిన అన్నదమ్ములు
  •     జల్సాల కోసం ముగ్గురు మైనర్లతో కలిసి చోరీలు
  •     ముఠా అరెస్ట్.. 10 బైక్​లు సీజ్

జీడిమెట్ల, వెలుగు: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములతో పాటు వారికి సహకరించిన ముగ్గురు మైనర్లను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మెదక్ జిల్లాకు చెందిన దాసరి సురేశ్ (19), దాసరి మహేశ్ (20) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అల్వాల్​లో ఉంటూ డెలివరీ బాయ్​గా ఒకరు, లారీ హెల్పర్​గా మరొకరు పనిచేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో బైక్ దొంగతనాలు మొదలుపెట్టారు. ఈ నెల 10న బాచుపల్లిలో జరిగిన ఒక బైక్ దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. 

బుధవారం రాజీవ్ గాంధీనగర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాచుపల్లి, పేట్​బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కూకట్​పల్లి పరిధిలో మొత్తం 10 బైకులు దొంగిలించినట్లు అంగీకరించారు. ఈ దొంగతనాల్లో ముగ్గురు మైనర్లను సైతం వాడుకున్నట్లు తేలడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు.