అధికారం పోయిందనే అక్కసుతోనే విమర్శలు..రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర BRSదే: మంత్రి సీతక్క

అధికారం పోయిందనే అక్కసుతోనే విమర్శలు..రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర BRSదే: మంత్రి సీతక్క

మహబూబాబాద్, వెలుగు: అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్ఎస్  నాయకులు ప్రజా ప్రభుత్వంపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్​ అయ్యారు. మంగళవారం మహబూబాబాద్  జిల్లా కొత్తగూడలో లబ్ధిదారులకు స్మార్ట్​ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్  పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపిందని, ఆ భారం భరిస్తూనే ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వెయ్యి రోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. 

బీఆర్ఎస్  హయాంలో దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీలు ఇచ్చి అమలు చేశారా? అని ప్రశ్నించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్  గ్లోబల్  ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈజీఎస్  స్టేట్​ డైరెక్టర్  చల్లా నారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్​ మెంబర్​ నునావత్  రాధ పాల్గొన్నారు 

శిరీష ఫ్యామిలీకి అండగా ఉంటాం 

ములకలపల్లి: హైదరాబాద్  తుక్కుగూడలో హత్యకు గురైన నర్సు ఉకే శిరీష ఫ్యామిలీకి అండగా ఉంటామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలోని శిరీష గ్రామానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మహిళా కమిషన్  సభ్యురాలు నునావత్ రాధాబాయితో కలిసి వెళ్లి మృతురాలి ఫ్యామిలీని పరామర్శించారు. 

శిరీష ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిరీష హత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసిందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 

బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు అందజేస్తామని, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.లక్ష, ఐటీడీఏ నుంచి రూ.30 వేలు, తాను, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వ్యక్తిగతంగా రూ. లక్ష ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు. భవిష్యత్​లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.