2025లో మీ పిల్లలను బీటెక్లో జాయిన్ చేస్తున్నారా..? పేరెంట్స్కు ఇది పిడుగు లాంటి వార్తే..!

2025లో మీ పిల్లలను బీటెక్లో జాయిన్ చేస్తున్నారా..? పేరెంట్స్కు ఇది పిడుగు లాంటి వార్తే..!
  • ఇంజనీరింగ్​ ఫీజులపై  గందరగోళం
  • కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్​ఆర్సీ.. మేనేజ్మెంట్లు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే!
  • చాలా కాలేజీల్లో రూ. లక్షకు పైనే ఫీజులు? 
  • నాలుగిట్లో అయితే ఏకంగా రూ. 2లక్షలకుపైనే..!
  • ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్​ఆర్సీ.. వెల్లువెత్తుతున్న ఆరోపణలు 
  • 8 రోజుల్లోనే 157 కాలేజీల హియరింగ్ పూర్తి 
  • యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలనూ క్రాస్​ చెక్​ చేసిందీ లేదు!
  • మళ్లీ ప్రతిపాదనలు రెడీ చేయాలని సర్కార్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై గందరగోళం నెలకొంది. రానున్న మూడేండ్లలో ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులరేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం  కాలేజీలను తనిఖీ చేయకుండా.. కేవలం యాజమాన్యాలు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్​ కాలేజీల్లో తక్కువలో తక్కువ రూ. 50 వేల వరకు ఫీజులు ఉండగా.. వచ్చే మూడేండ్లకు గాను టీఏఎఫ్​ఆర్సీ చేసిన తాజా ప్రతిపాదనల్లో తక్కువలో తక్కువ రూ. 80 వేల వరకు ఫీజులు ఉన్నట్లు చర్చ జరుతుగున్నది. చాలా కాలేజీల్లో ఇవి రూ. లక్షకు పైనే ఉన్నాయని, కొన్ని కాలేజీల్లో అయితే ఏకంగా రూ. రెండు లక్షల దాకా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  

ఫిబ్రవరిలో కసరత్తు మొదలు
2022–23లో టీఏఎఫ్​ఆర్సీ నిర్ణయించిన ఫీజులు 2024–25 విద్యాసంవత్సరంతో ముగుస్తున్నాయి. ఈ ఆగస్టులో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరంతోపాటు 2026–27, 2027–28 సంవత్సరాల బ్లాక్ పీరియడ్​కు గానూ ఇంజనీరింగ్ ఫీజులను ఫైనల్​ చేయాల్సి ఉంది. దీనికోసం టీఏఎఫ్ఆర్సీ ఫిబ్రవరి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 157  ప్రైవేటు కాలేజీల నుంచి గత రెండేండ్ల ఆదాయ వ్యయాలను సేకరించింది. ఈ క్రమంలోనే  ఏ మేరకు ఫీజులు పెంచాలనే ప్రతిపాదనలనూ కాలేజీల నుంచి తీసుకున్నది. 

చాలా కాలేజీలు ప్రస్తుతమున్న ఫీజులను డబుల్ చేయాలని ప్రపోజల్స్ అందించాయి. ఈ క్రమంలో కాలేజీల హియరింగ్ కూడా పూర్తి చేసి.. ప్రైమరీగా ఫీజులను నిర్ధారిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నాలుగు కాలేజీల్లో రూ. రెండు లక్షలకుపైగా, సగానికి పైగా కాలేజీల్లో రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా ఫీజులు ఖరారు చేయాలని టీఏఎఫ్​ఆర్సీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముందే ఎంత ఫీజు పెంచుతామనే విషయాన్ని కూడా కాలేజీలకు చెప్పి.. వాళ్లు దానికి అంగీకరిస్తున్నట్టు సంతకాలూ తీసుకున్నది. 

8 రోజుల్లో.. 157 కాలేజీల హియరింగ్
కొత్త ఫీజుల ఖరారు కోసం టీఏఎఫ్​ఆర్సీ నిర్వహించిన కాలేజీల హియరింగ్ తూతూమంత్రంగా నిర్వహించారనే ఆరోపణలున్నాయి. కమిటీ ఆఫీసులో ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి10 వరకు  ప్రైవేటు కాలేజీల హియరింగ్ నిర్వహించారు. మొత్తం 163 కాలేజీలకు షెడ్యూల్ ఇవ్వగా.. 157 కాలేజీలు అటెండ్ అయినట్టు అధికారులు తెలిపారు. కేవలం 8 రోజుల్లోనే.. కాలేజీల మేనేజ్​మెంట్లతో సమావేశమై.. ఫీజులపై నిర్ధారణ చేశారు. హియరింగ్ అంతా మమ అన్నట్టుగా చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఒక్కో కాలేజీకి 10, 15 నిమిషాల్లోనే హియరింగ్ పూర్తి చేయడంపై ఆరోపణలు వినిపించాయి. అయినా, విద్యాశాఖ ఉన్నతాధికారులు అప్పట్లో స్పందించలేదు. 

ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులు
ఇంజనీరింగ్​ కాలేజీల మేనేజ్మెంట్ల నుంచి 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించిన కాలేజీల ఫైనాన్షియల్ఆడిట్ రిపోర్టును టీఏఎఫ్​ఆర్సీ తీసుకుంది. దీంట్లో కాలేజీలు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులను నిర్ధారించడం గమనార్హం. ప్రైవేటు కాలేజీలు ఇచ్చిన లెక్కలను ప్రభుత్వ ఆడిట్ డిపార్ట్ మెంట్ అధికారులతో కాకుండా  ప్రైవేటు చార్టెడ్ అకౌంటెంట్ల ద్వారా ఆడిట్ చేయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. అయితే, గతం నుంచి వస్తున్న విధానాన్నే ప్రస్తుతం కొనసాగించినట్టు టీఏఎఫ్​ఆర్సీ అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు భారీగా పెంచడం.. కొన్నింటిలో నామమాత్రంగా పెంచడం వంటి  ప్రతిపాదనలపై టీఏఎఫ్​ఆర్సీ మీటింగ్​లో విద్యాశాఖ ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫీజుల ప్రతిపాదన  అసంబద్ధంగా ఉందని, మళ్లీ ఖరారు చేయాలని సూచించారు. కాలేజీలు ఇచ్చిన లెక్కలను కూడా కనీసం క్రాస్  చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జేఎన్టీయూ, ఓయూ అధికారుల తనిఖీల సమయంలో ప్రైవేటు కాలేజీలన్నీ తప్పుడు లెక్కలు ఇచ్చినట్లు పలు కాలేజీల లెక్చరర్లు, సిబ్బంది సీఎంవోకు ఫిర్యాదు చేశారు. తక్కువ జీతాలిచ్చి.. భారీగా ఇచ్చినట్టు తప్పుడు డేటాను వర్సిటీలకు ఇచ్చారని వాటిలో పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలున్నా.. ఏ కాలేజీనీ టీఏఎఫ్​ఆర్సీ తనిఖీ చేయలేదు. అయితే, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీలు కాలేజీలను తనిఖీ చేసి, ఆ వివరాల ఆధారంగానే ఫీజులను నిర్ధారణ చేస్తున్నాయి. మరోపక్క వర్సిటీలు చేపట్టిన ఫైండ్ ఫ్యాక్ట్ కమిటీలు (ఎఫ్ఎఫ్​సీ) రిపోర్టులనూ టీఏఎఫ్​ఆర్సీ తెప్పించుకొని చూడలేదన్న ఆరోపణలు ఉన్నాయి.  

సీఎం సీరియస్
ఇంజనీరింగ్కు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరం ఈ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల ఫస్ట్​ వీక్లో కౌన్సెలింగ్​ జరిగే అవకాశం ఉంది. ఈలోపు ఫీజులపై క్లారిటీ రావాలి. ఇప్పటికే ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా ఉన్నది. భారీగా ఫీజులు పెంచడంతో విద్యార్థులతోపాటు సర్కారుపైనా భారం పడనుంది. దీంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమావేశంలో ఇదే అంశంపై వాఢీవేడి చర్చ జరిగింది. ఇష్టానుసారంగా ఫీజుల పెంపును ఒప్పుకునేది లేదని, మరోసారి సమీక్షించాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.