- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
- ప్రతీ హాస్పిటల్ క్యాన్సర్ లెక్కలు చెప్పాల్సిందే
- పోర్టల్‌లో నెల రోజుల్లోపే వివరాల నమోదు తప్పనిసరి
- కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి గల్లీ క్లినిక్‌ల దాకా వర్తింపు
- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని అడ్డుకోవడానికి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులను పక్కాగా లెక్కగట్టేందుకు ఈ వ్యాధిని నోటిఫైడ్ డిసీజ్ గా గుర్తిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 17 ప్రకారం.. రాష్ట్రంలోని ఏ మూల క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాల్సిందే. ప్రస్తుతం కేవలం నిమ్స్, ఎంఎన్ జే వంటి కొన్ని ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు ఉండగా, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే గొడుగు కిందకు డేటాను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది.
నెల రోజుల్లోపే సమాచారం ఇవ్వాలి
క్యాన్సర్ నిర్ధారణ అయిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూనే, ఆ సమాచారాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అందజేయాలని నిబంధన విధించారు. ఏ ఆస్పత్రిలోనైనా లేదా డయాగ్నోస్టిక్ ల్యాబ్ లోనైనా క్యాన్సర్ నిర్ధారణ అయితే నెల రోజుల్లోపు ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్-సిటు (ప్రారంభ దశ), ఇన్వాసివ్ క్యాన్సర్లు ఇలా ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే పూర్తి వివరాలను ఆన్ లైన్ ద్వారా వెల్లడించాలి. ఇందుకోసం జిల్లా స్థాయిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్వో) పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు. ఆస్పత్రులన్నీ తప్పనిసరిగా క్యాన్సర్ రిజిస్టర్ ను నిర్వహించాల్సి ఉంటుంది.
అన్ని రకాల ఆస్పత్రులకూ వర్తింపు
ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని రకాల వైద్య సంస్థలకు వర్తిస్తాయి. కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్ లు, నర్సింగ్ హోమ్‌లు, ఆయుష్ ఆస్పత్రులతో పాటు ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే, మిలిటరీ ఆస్పత్రులు కూడా ఈ నిబంధనను పాటించి తీరాలి. అలాగే వ్యాధిని నిర్ధారించే పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్ లు కూడా వివరాలను నమోదు చేయాలి. ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన ఆస్పత్రులకు నేరుగా లాగిన్ ఐడీలు కేటాయించగా, మిగిలిన ప్రైవేట్ సంస్థలు పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నోడల్ సెంటర్‌గా ఎంఎన్‌జే ఆస్పత్రి...
రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ డేటా మొత్తాన్ని క్రోడీకరించడానికి హైదరాబాద్ లోని మెహదీ నవాజ్ జంగ్ ( ఎంఎన్ జే ) క్యాన్సర్ ఆస్పత్రిని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆస్పత్రి అధికారులు డేటాను నిశితంగా పరిశీలించి, రాష్ట్ర స్థాయి క్యాన్సర్ రిజిస్ట్రీని నిర్వహిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎమ్మార్) ప్రమాణాలకు అనుగుణంగా డేటాను జాతీయ స్థాయి రిజిస్ట్రీకి కూడా అనుసంధానిస్తారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, మరణాల రేటు ఎలా ఉంది అనే విషయాలపై స్పష్టత వస్తుంది. తద్వారా భవిష్యత్తులో సరైన వైద్య విధానాలను రూపొందించడానికి, స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వానికి వీలవుతుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు పేర్కొన్నారు.
