- రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆర్థిక సహకారంతో ఉచిత శిక్షణ
హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌జెండర్ల సామాజిక, ఆర్థిక సాధికారతకు జాతీయ పర్యాటక, హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థ (నిథమ్) ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత క్యాంటీన్ చెఫ్ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు కొనసాగే శిక్షణను నిథమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. శిక్షణలో వంటల తయారీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, కస్టమర్ సర్వీస్, ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలు, ఆర్థిక అక్షరాస్యత, సోషల్ మీడియా మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.
అనుభవజ్ఞులైన చెఫ్‌ల పర్యవేక్షణలో టిఫిన్లు, సలాడ్లు, శాండ్‌విచ్‌లు, రైస్ వెరైటీలు, స్నాక్స్, నూడుల్స్, గ్రేవీలు, రోటీలు, బిర్యానీ, సంప్రదాయ థాలీలు, స్వీట్లు, చేపల వంటకాల తయారీలో ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు. కోసం అత్యాధునిక వంటశాలలు, తరగతి గదులు, ఉచిత వసతి, భోజన సౌకర్యాలను నిథమ్ కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా ట్రాన్స్‌జెండర్లు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడంతో పాటు సొంతంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయని ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే నిథమ్ లక్ష్యమని, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను ట్రాన్స్‌జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
సామాజిక సమ్మిళితత్వమే ధ్యేయం: నిథమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ సంస్థ ధ్యేయమని నిథమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ తరహా శిక్షణా కార్యక్రమాల ద్వారా ట్రాన్స్‌జెండర్లు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, సంస్థాగత వంటశాలల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందడమే కాకుండా, సొంతంగా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకుని ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
