హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, సగం పదవీకాలం పూర్తికాకముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. గురువారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజాకంటకంగా మారిందని విమర్శించారు. సీఎం స్వయంగా చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలం ముగిసిపోతుందన్న భయంతోనే సీఎం రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతూ తన అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. సాగు నీటి కోసం అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన సీఎం.. రక్తం పారిస్తా అంటూ మాట్లాడడం దురదృష్టకరమన్నారు.
సీఎం వ్యాఖ్యలతో రైతులు కూడా ‘మా రక్తాన్ని తీసుకోండి... కానీ మా పొలాలకు నీళ్లు ఇవ్వండి’ అని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. యువత, నిరుద్యోగుల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరిట భారీ మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వరుస సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ రైతు సభ అనంతరం, ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెడ్తామని చెప్పారు.
